భద్రాద్రి రాముని దర్శనం-సర్వపాప హరణం


పరమ పవిత్రమైన గోదావరి నదీతీరాన శ్రీరామచంద్రుడు సీతా,లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం పావన క్షేత్రం భద్రాచలం. ఇక్కడ శ్రీరాములవారు సీతా లక్ష్మణ సమేతుడైై చతుర్భుజుడుగా వెలిసారు. స్వామి పశ్చిమానికి అభిముఖంగా ఉండి దక్షిణ ప్రవాహి అయిన గోదావరి నదిని వీక్షిస్తుండటం ఈ క్షేత్ర ప్రాధాన్యతల్లో మరొకటి. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది, దీని గురించి బ్రహ్మాండ పురాణంలోనూ, గౌతమీ మాహాత్మ్యంలోనూ ప్రస్తావించబడింది. ఈ ప్రాంతంలోనే త్రేతాయుగం నందలి శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై వనవాసం చేసాడని పురాణాల్లో చెప్పబడింది. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి క్షేత్రదర్శనం విశేషాలు తెలుసుకుందాం.

భద్రాద్రి స్థల పురాణం

పురాణగాధ ప్రకారం శ్రీరాముడు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో ఒక బండరాయి మీద సేద తీరాడు. సేద తీరిన తర్వాత ఆబండరాయిని అనుగ్రహించి మరుజన్మలో నువ్వు మేరుపర్వత పుత్రుడు భద్రుడుగా జన్మిస్తావని అపుడు నీ కొండపైనే శాశ్వత నివాసం ఉంటానని వరమిచ్చాడు. ఆ వర ప్రభావంతో భద్రునిగా జన్మించి శ్రీరామునికై తపస్సు చేయగా భద్రుడిని అనుగ్రహించి భద్రగిరిపై వెలసి ఒక పుట్టలో నివాసం ఉన్నాడు శ్రీరాముడు. కాలక్రమంలో శబరి శ్రీరాముని అనుగ్రహంతో పోకల దమ్మక్కగా జన్మించింది, భద్రాచలం సమీపంలోని భద్రారెడ్డిపాలెంలో రామునికి పరమ భక్తురాలిగా ఉంటూ ఎపుడూ రామనామ స్మరణ చేస్తుందేది.

ఒకరోజు కలలో రాముడు ప్రత్యక్షమై నేను భద్రగిరిపై ఎండకు ఎండి వానకు తడిసి ఉంటున్నాను, నాకు ఏదైనా నీడ నిర్మించమని ఆదేశించాడు. దమ్మక్క తెల్లవారగానే స్వామి చెప్పిన ప్రాంతానికివెళ్ళి చూడగా పుట్టలో వెలసి ఉన్న రామచంద్రుడు సాక్షాత్కరించాడు. పుట్టను శుభ్రం చేసి తాటాకులతో తనకు చేతనయినట్టు ఒక పందిరి వేసి విగ్రహాలను ఉంచి దమ్మక్క పూజలు చేస్తుండేది.

భద్రారెడ్డిపాలెంకు కూతవేటుదూరంలో గల నేలకొండపల్లి గ్రామంలో ఉండేవాడు కంచర్ల లింగన్న, కామమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు కంచర్ల గోపన్న. చిన్నతనం నుండి గొప్ప శ్రీరామ భక్తుడు. యవ్వనం రాగానే గోపన్నకు దగ్గర బంధువు, తానిషా ప్రభువు దగ్గర మంత్రిగా ఉంటున్న అక్కన్న పాల్వంచ ప్రాంతానికి తహసీల్దారుగా నియమించాడు. ఆ పరగణాలోనే ఉన్న భద్రగిరి ప్రాంతం సందర్శించిన గోపన్న స్వామికి సరైన ఆలయం లేకపోవడంతో చలించి, పన్నులుగా వసూలయిన ధనంతో రామాలయం ను సర్వాంగ సుందరంగా నిర్మించాడు.

దీనితో కొపోద్రిక్తుడైన తానిషా గోపన్నను చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురి చేసాడు. తానిషాకు రామచంద్రుడు కరుణించి లక్ష్మణ సమేతుడై కలలో కనిపించి తన కాలం నాటి రామమాడలను(నాణాలు) చెల్లించాడు. తానిషా ఒక్కసారిగా మేల్కొని చూడగా ఆలయానికి గోపన్న ఎంతయితే వినియోగించాడో అంత సొమ్ము రాశిగా పోసి ఉండటం గమనించాడు. దీనితో భక్తుడైన గోపన్న పట్ల తాను చేసిన తప్పును తెలుసుకుని ఖైదునుండి విడుదల చేసాడు. ఇదీ భద్రాచలం ఆలయ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర. గోపన్న ఎపుడూ రామకీర్తనలు పాడుకుంటూ నిత్యం రామధ్యానంలో మునిగి ఉండేవాడు కాబట్టి రామదాసుగా ప్రసిద్ధికెక్కాడు.

వేడుకలు చూడ రెండు కనులు చాలవు

భద్రాచలంలో జరిగే ముఖ్యమైన ఉత్సవం శ్రీరామనవమి. స్వామివారి ఆలయంలో ఎంతో కన్నుల పండుగగా ఈసీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. చైత్రశుద్ధ నవమినాడు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణంలో స్వామివారు కట్టే తాళిబొట్టును రామదాసు స్వయంగా చేయించాడు. ఇప్పటికీ ఆ మంగళసూత్రాన్నే వినియోగిస్తున్నారు. కళ్యాణం నిమిత్తం అప్పటి తానిషా ప్రభుత్వ సాంప్రదాయం ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం గతంలో ముత్యాల తలంబ్రాలు సమర్పించేది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సాంప్రదాయం కొనసాగిస్తోంది. సీతారాముల కళ్యాణమహోత్సవం చూసి తరించడానికి రాష్ట్రం నలుమూలల నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు.

శ్రీరామనవమితో పాటుగా శ్రీమహా విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన వైకుంఠ ఏకాదశిని కూడా ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఏకాదశికి గోదావరి నదిలో నిర్వహించే తెప్పోత్సవం, ఉదయం 5.00 గంటలకు జరిగే వైకుంఠద్వార దర్శనం భక్తులకు తనివి తీరదు. భక్తరామదాసు పేర వాగ్గేయకార మహోత్సవాలు ఏటా భద్రాచలంలో నిర్వహిస్తుంటారు. 1972 నుండి ఇవి ఇక్కడ నిర్వహించబడుతున్నాయి.

భద్రాచలం ఇలా చేరుకోవాలి

భద్రాచలం చేరుకోవడానికి రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుండి రవాణాసౌకర్యం ఉంది. రాజమండ్రి నుండి 200 కిలోమీటర్లు, కాకినాడ నుండి 230 కి.మీ, విజయవాడ నుండి 185 కి.మీ, హైదరాబాద్‌ నుండి 310 కి.మీ, విశాఖపట్నం నుండి 350 కి.మీ, చెన్నై నుండి 630 కి.మీ, బెంగుళూరు నుండి 875 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల నుండి భద్రాచలం చేరుకోవడానికి రోడ్డు రవాణా సదుపాయం

ఉంది. భద్రాచలానికి రాజమండ్రి నుండి గోదావరి నది ద్వారా లాంచి సౌకర్యం కూడా లభిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి విమానమార్గం ద్వారా భద్రాచలం చేరుకోవాలంటే ముందుగా విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌ నగరాలకు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా భద్రాచలం చేరుకోవచ్చు.

ఇక రైలు మార్గం గుండా వచ్చేవారు ముందుగా జిల్లా కేంద్రం ఖమ్మం చేరుకుని అక్కడి నుండి బస్సు ద్వారా భద్రాద్రి చేరుకోవచ్చు. భద్రాచలానికి రైలుమార్గం ద్వారా అతి దగ్గరగా చేరుకోవాలనేవారు దగ్గరలోని రైల్వే స్టేషన్‌ కొత్తగుడెం రావాల్సి ఉంటుంది. కానీ ఇక్కడికి ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే పరిమితంగా తిరుగుతాయి. వసతి సదుపాయాల విషయానికి వస్తే భద్రాచలంలో అన్నిరకాల ప్రజలకు వారివారి స్తోమత మేరకు వసతి సౌకర్యం లభిస్తుంది. దేవస్థానం సత్రాలు, వసతి గృహాలు అందుబాటులో ఉంటాయి.

ఆలయ సమయాలు-అర్చనలు

రామాలయం ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఉదయం 6.00 నుండి 7.00 వరకూ అంతరాలయ సేవ అనంతరం 8.00 వరకూ అభిషేకాలు నిర్వహిస్తారు. 8.30 నుండి 9.30 మధ్యకాలంలో కేశవ నామార్చన, సహస్ర నామార్చనలు జరుగుతాయి. 9.30 నుండి 11.00 వరకూ స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6.30 నుండి రజత రత్న సేవ ప్రారంభం అవుతుంది. రాత్రి 8.00 నుండి 8.30 వరకూ ఆలయ చుట్టు సేవ, వాహన సేవలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక సేవల్లో పాల్గొనేవారు నిర్ణీత రుసుము చెల్లించాలి. మధ్యాహ్నం 1.00 నుండి 3.00 వరకూ మినహా మిగిలిన వేళల్లో భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవచ్చును.