దక్షిణ భారతదేశంలో ఉన్న ముఖ్యమైన నదుల్లో కావేరీ నది ఒకటి. కన్నడ, తమిళ సంస్కృతీ
సంప్రదాయాలకు ఆలవాలమైన సంగీతం, శిల్పం, సృజనాత్మకత, మత గ్రంథాలు మొదలైనవి
ఈ కావేరీనదీ తీర ప్రాంతాలలోనే పురుడు పోసుకున్నాయి. ఈ నదీ జనన మహాత్మ్యాల గురించి పురాణ ఇతిహాసాలలోను, తమిళ, కన్నడ సాహిత్యం లోను చాలా గొప్పగా చెప్పబడింది.
పూర్వం కవేరుడనే రాజర్షి ముక్తిని అర్థిస్తూ బ్రహ్మనుగూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆతని కోరిక తెలుసుకుని విష్ణుమాయను కవేరునకు కుమార్తెగా ఇచ్చి, ఆమె ద్వారా నీవు ముక్తినిపొందగలవు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మ ఇచ్చిన కవేర కన్యక దిన దిన ప్రవర్ధవర్థమానం అవుతోంది. ఈ క్రమంలో తను నదిగా మారి, తనలో స్నానమాచరించే అందరికీ పాప విముక్తి కలగాలనే విశ్వకళ్యాణ వాంఛతో శ్రీహరికోసమై తపస్సు చేసింది.
ఆ తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆమె కోరిక తెలుసుకొని ''నా అంశతో పుట్టిన అగస్త్య
మహాముని బ్రహ్మచే ప్రేరితుడై నిన్ను వివాహమాడడానికి వస్తాడు. నీవు ఆయనను వివాహమాడిన తక్షణమే నదివి కాగలవు. అంతట అతడు నిన్ను తన కమండలంలో ఉంచుకుంటాడు. తరువాత నువ్వు సహ్యపర్వతం చేరిన వేళ నదిగా మారి ప్రవహించు'' అని అంతర్ధానమయ్యాడు. శ్రీహరి వాక్కును అనుసరించికవేరి కన్యక అగస్త్యుని వివాహమాడి నదిగా మారింది.
శ్రీహరి చెప్పిన విధంగానే అగస్త్యుడు కావేరిని తన కమండలంలో ఉంచుకుంటాడు. కొంతకాలం గడిచాక గర్వంతో విర్రవీగుతున్న వింధ్యపర్వత గర్వాన్ని అణచివేసేందుకు అగస్త్యుడు శిష్యగణ సహితంగా సిద్దమై, శిష్యులను పిలిచి తన కమండలమును తీసుకుని రమ్మని చెప్పి తాను ముందుగా బయలుదేరుతాడు. శిష్య గణంతో అక్కడికి చేరిన కవేరికి సహ్యపర్వత సమీపంలో అగస్త్యుడు లేకపోవటం చూసి తన కార్యం గుర్తుకువచ్చి కవేరతనయ నదియై నేలపైకి చేరి ప్రవహించింది. ఇలా ప్రవహించిన నది కావేరీ నదిగా ప్రఖ్యాతి పొందింది. ఈ నదిలోనే కవేర రాజర్షి స్నానమాచరించి ముక్తిపొందినట్టు పురాణగాధ చెబుతోంది.
మరొక కథ
అగస్త్యుడు తన కమండలంలో గంగాజలాన్ని తీసుకొని వింధ్యపర్వతం దాటి దక్షిణాపథానికి వస్తూ ఉండగా, అతని కమండలంలోని జలాన్ని వినాయకుడు 'కాకి' రూపం ధరించి ఒలకబోసాడట. ఇలా కమండలం నుండి జారిన జలం ఇంద్రుడు తపస్సు చేస్తున్న ఉద్యానవన ప్రదేశాన్ని తడిపివేస్తుంది.ఇలా కాకవిరి అంటే కాకి వల్ల విస్తరించిన జలం 'కావేరి' అయిందని దీని భావన. తమిళంలో 'కా' అనే శబ్దానికి తోట అనే అర్థం కూడా ఉంది.
ఇంద్రుని ఉద్యానవనంలో విస్తరించిన జలం కనుక 'కావేరి' అయిందని కొందరి భావన. తమిళ
సారస్వతంలో ప్రముఖంగా పేర్కొనబడే కావ్యాల్లో ప్రసిద్ధమైన 'మణిమేఖలై' అనే కావ్యం కావేరీ
జననం గురించి ఈ విధమైన ప్రస్తావన చేసింది. అగస్త్యుని కమండలంలో ఉన్న జలాన్ని కంధమనుడనే రాజు తన పాలనలోని దేశం సస్యశ్యామలం కావడానికి ఇవ్వమని ప్రార్థించగా ఆయన తన కమండలంలోని జలాన్ని విడువగా అదే కావేరీ నది అయిందని మరో కథ.
కావేరీ జన్మస్థానం
సహ్యపర్వతపు శ్రేణుల్లో సముద్రమట్టానికి 1,320 మీటర్ల ఎత్తున మైసూర్‌లోని బ్రహ్మగిరి కొండపైకావేరి ఆవిర్భవించింది. కొడుగు లేదా కూర్గు అనే ప్రాంతం ఈ నది రూపుదాలుస్తుంది. కాబట్టి ఈ నదిని 'కూర్గుకుమారి' అని అంటారు. కావేరీ ఉద్భవించే ప్రదేశాన్ని 'తలక్కావేరి' అని అంటారు.
కావేరీ పుట్టే చలమ ఒక చిన్న తొట్టి ఆకారంలో ఉంటుంది. ఈ తలక్కావేరీలో కావేరీ మాత పెద్ద విగ్రహం ఉంది. కావేరీ దేవతగా పిలువబడుతూ భక్తుల కోరికలు తీర్చే ఇలవేల్పుగా కావేరీ నదిగా ఆ ప్రాంతంలో పేరుపొందింది. కావేరీ దేవతకు ఇక్కడ ప్రతిఏటా శ్రావణమాసంలో గొప్ప ఉత్సవం జరుగుతుంది.
కావేరిపై 50కి పైగా ఉపనదులు
దక్షిణగంగగా పేరుపొందిన కావేరికి షింసా, భవాని అనే రెండు నదులు ముఖ్యమైన ఉపనదులుగా చెప్పబడుతున్నాయి. ఇవిగాక కనక, సుజోజ్యోతి, హేమవతి, లోకపావని, ఆర్ఖావతి, తొప్పైయ్యేరు, శరభంగ, మణిముధర, హోళె, సాగరఘటె, లక్ష్మణతీర్థ, కాబిని కుండల, అమరావతి మొదలైన చిన్నవి, పెద్దవి మొత్తం కలిపి 50కి పైగానే కావేరీకి ఉపనదులు ఉన్నాయి. వీటివల్లనే కావేరీనది వెడల్పు పెరిగి ప్రవహించడం జరుగుతోంది.
నదీపరీవాహక ప్రాంతం
కావేరీ పరీవాహక ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకే కావేరిని 'పొన్ని' అని
అంటారు. పోన్ అంటే ధాన్యమని, బంగారమని రెండర్థాలు ఉన్నాయి. ఈ నది ధాన్య సమృద్ధిని
కలిగిస్తుందని ప్రజల నమ్మకం కాబట్టి బంగారుపంట పండించేదని దీనికి పేరు. కూర్గు కొండల్లో జన్మించిన కావేరీనది కొంతదూరం పర్వతసీమలందే ప్రవహిస్తుంది. దట్టమైన అడవులున్న కూర్గు ప్రాంతపు తూర్పు పల్లాలో మనకు వెదురుచెట్లు, గంధపుచెట్లు అధికంగా కనిపిస్తాయి. ఈ కొండల్లో కాఫీతోటలు, కమలాఫలాల తోటలు కూడా ఉన్నాయి. ఈ కొండల్లోని 1500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అభయారణ్యం అనేక రకాల వన్యప్రాణులకు సురక్షిత నివాసస్థలం.
కొండ ప్రాంతాలగుండా ప్రవహించిన ఈ నది ఆగ్నేయ దిశగా ప్రవహించి, మైసూరు రాష్ట్రంలో
పీఠభూమి దశ వదలి క్రిందన గల పల్లంలోనికి శివసముద్రం అనే ప్రాంతం వద్ద దూకుతుంది.
ఇదే దేశ వ్యాప్తంగా పేరుగాంచిన శివసముద్ర జలపాతం. శివసముద్రం దగ్గర కావేరీ నది పరచుక్కి, గగనచుక్కి అని రెండు పాయలుగా చీలుతుంది.. పరచుక్కి సుమారు 230 అడుగులు పైనుండి కిందకి జలపాతంలా జాలువారుతుంది. గగనచుక్కి 300 మీటర్లు ఎత్తునుండి కిందకి దుమికి తెల్లటి నురుగు రూపంలో అత్యంత అద్భుతంగా ఉంటుంది. శివసముద్రం దాటిన తరువాత కావేరీ తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి అక్కడగల తంజావూరు జిల్లాలోఎక్కువశాతం ప్రవహించి, అక్కడినుంచి మరికొంత దూరం సాగి బంగాళాఖాతంలో కలుస్తుంది.
కావేరీ నదీ గమనం చాలా చిత్రంగా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి వేగం, వైశాల్యం మారుతూ ఉంటాయి. కొన్నిచోట్ల మేక దాటే వెడల్పులో కూడా ఉంటుంది. ఎక్కువ శాఖలు, ఎక్కువ పాయలు ఉన్న కావేరీ పొడవు 475 మైళ్ళు, నది పరీవాహక ప్రదేశం 28,000 చదరపు మైళ్ళు.
ఘన చరిత్రకు ఆలవాలం
కావేరీనిలోని ప్రతి నీటిబట్టు బహు ఉపయోగకారి. ఈ నదిపై ఆనకట్టలూ, డ్యాములూ కట్టి నీటిని క్రమబద్ధీకరించ ముందు కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడి భూములను సాగుచేసిన పూర్వీకుల ప్రభావం ఇప్పటితమిళ ప్రజలపై కనిపిస్తుంది. దాదాపుగా 4000 ఏళ్ళ క్రితం రాతియుగంలో కూడా ఇక్కడ వ్యవసాయంచేసేవారు. సాలివాహన శకం పూర్వం 1500-1000 మధ్య ఈ ప్రాంతంలో రాతిపనిముట్లను (రాతి గొడ్డళ్ళు, విల్లంబులు, వంటపాత్రలు, పూసలు) ఉపయోగించిన రాతియుగపు మనుషులు ఉండేవారు.
ఆ పనిముట్ల అవశేషాలు ఇప్పుడు బెంగుళూరు, చెన్నై రహదారిపై పాయంపల్లి పురాతత్త్వశాలలో
ఉన్నాయి. అంతేకాక క్రీస్తుశకం పూర్వం 1000ా300 మధ్య వాడిన పరికరాలు (లోహపాత్రలు,స్త్రీల బంగారునగలు, మట్టిగాజులు) పనిముట్లు(ఇనుప ఆయుధాలు) మొదలైనవి పురాతత్వవేత్తలు వెలికితీసారు.