శ్లోకం: మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రతో శివ రూపాయ
వృక్షరాజాయ తే నమోనమః
అలాగే త్రిమూర్తులు అశ్వత్థ వృక్షానికి దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోని కొమ్మలు. తూర్పుదిక్కు కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు. దాని వేళ్ళలో మహర్షులు, గోబ్రాహ్మణులు, నాలుగు వేదాలు ఉంటాయి. సప్తసముద్రాలు, పుణ్యనదులు తూర్పుకొమ్మలలో ఉంటాయి. ఈ వృక్షం యొక్క మూలంలో ‘అ’కారము, మానులో ‘ఉ’ కారము, దాని పండ్లు ‘మ’ కారము. ఆ వృక్షమంతా కలసి ప్రణవస్వరూపమే.
అశ్వత్థ వృక్షాన్ని సేవించే విధానం
అశ్వత్థ (రావి) చెట్టు సాక్షాత్తూ కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానాన్ని తెలియచేస్తూ నారదమహర్షులవారు నుడివిన విషయం ఏమిటంటే శుభసుముహూర్తంలో స్నానాదులు పూర్తిచేసి శుచియై ప్రారంభించాలి. ప్రవహిస్తున్న నీటిలో స్నానంచేసి ఉతికిన బట్టలు ధరించి విభూతిధారణ గాని, కుంకుమధారణ గాని చేయవలెను.
మొదటగా గణపతిని పూజించి సంకల్పం చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. దేవతామయమైన ఆ వృక్షానికి షోడశోపచార పూజ చేయాలి. అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గలవానిగా భావించి ధ్యానించాలి. తరువాత విష్ణుసహస్రనామం చదువుతూ గాని, మౌనంగా గాని, నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట, చివర నమస్కారాలు చేయాలి. త్రికరణశుద్ధిగా దృష్టి నిలిపి చేసినట్లయితే మంచి ఫలితం లభిస్తుంది. ఆది, మంగళవారాల్లో అశ్వత్థమును తాకకూడదు. అంతే కాకుండా సంధ్య వేళల్లో కూడా ముట్టుకోకూడదు. అశ్వత్థాన్ని
కోణస్థః పింగళోబభ్రుః
కృష్ణో రౌద్రాంతకోయమః |
శౌరిశ్వనైశ్వరోమందః
పిప్పలా దేవసంస్తుతః ||
అనే మంత్రం దృఢ విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్ఠసిద్ధి కలుగుతుంది. గురువారం అమావాస్య కలసినరోజున రావిచెట్లు నీడన స్నానంచేస్తే పాపం నశిస్తుంది. అక్కడ వేదవిప్రునికి మృష్ఠాన్నం పెడితే కోటి బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం లభిస్తుంది. ఆ చెట్టునీడన గాయత్రీ మంత్రజపం చేస్తే నాలుగు వేదాలు చదివిన ఫలితం. రావిచెట్టును స్థాపిస్తే నలభైరెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది. కొట్టవేయడం మహాపాపం. సర్వం అశ్వత్థనారాయణ చరణారవిందార్పణమస్తు.