సంకష్ఠహర చతుర్థి వ్రత విధానము ఏమిటి? సంకష్ఠహర చతుర్థి పూజ ఎప్పుడు చేయాలి?


గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతాన్ని వరదచతుర్థి వ్రతం అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్థి , సంకటహర చతుర్థి వ్రతం అంటారు. వరద చతుర్థి వ్రతాన్ని మనం వినాయకచవితి రోజున చేస్తూ ఉంటాం. సంకష్టములను తీర్చేందుకు ప్రతీ మాసంలోను వచ్చే బహుళ చతుర్థి రోజున సంకటహర చవితి వ్రతాన్ని నిర్వహిస్తారు.

అంగారక చతుర్థి

సంకష్ట హర చతుర్థి మంగళవారం రోజున వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి వస్తే ఆరోజుకు చాలా విశిష్టత ఉంటుంది. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతుందని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితి రోజునే సంకటహర చవితిగా గమనించాలి. పంచమితో కూడిన చవితి రోజున ఈ వ్రతాన్ని చేయకూడదు.

సంకటహర చతుర్థి ‬ వ్రతం ఎలా చేయాలి?

సంకష్టహరచవితి వ్రతాన్ని సంకల్పించిన ప్రకారం 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. బహుళ చవితి రోజున ఈ వ్రతం ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ఉదయాన్నే శిర స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి. తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి. మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేయాలి. తరువాత ఒక తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి. దానినే గణపతిగా తలంచుకుని దేవునిముందు పెట్టి పూజ ప్రారంభించాలి. దీపం వెలిగించి, షోడశోపచారాలతో గణపతిని పూజించినతరువాత సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ధూపం వెలిగించి కొబ్బరికాయ, అరటి పళ్ళు స్వామికి నివేదించి హారతి సమర్పించాలి. సాయంత్రం తిరిగి పూజ చేసేవరకూ వినాయకుడిని కదపరాదు. వ్రతం ఆచరించేవారు సూర్యాస్తమయం వరకూ ఉపవాసం ఉండాలి.

పూజ తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి తాము సాయంత్రం తినాలి. ఇలా యధాశక్తి ఆ గణపయ్యను ఆరాధిస్తే మనం అనుకున్న కోరికలన్నీ సిద్ధించి, మన కష్టాలు తీరతాయని ప్రతీతి. సంకష్టహర చతుర్థి వ్రతం ఎలా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.