తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగను నేపాల్, బంగ్లాదేశ్ దేశాలతో పాటు ప్రపంచంలోని ప్రవాస భారతీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లలో దీన్ని దోల్యాత్రా లేదా బసంత-ఉత్సబ్ అంటే వసంతోత్సవ పండుగ అని పిలుస్తారు. హోళి పండుగను భగవంతుడైన కృష్ణుని ఆవాస ప్రాంతాలైన మథుర, బృందావనం, నందగావ్ మరియు బర్సానాలలో 16 రోజులు పాటు ఘనంగా నిర్వహిస్తారు.
దుల్హేతి, ధులండి, ధులెండి అని వివిధ ప్రాంతాల్లో పిలుచుకునే ఈ పండుగ రోజున, ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ తమ ఆనందాలను ఒకరితో మరొకరు పంచుకుంటారు. మానవుల సామాజిక సంబంధాల పటిష్టానికి ఈ హోళి పండుగ ఒక గొప్ప వేదికగా నిలుస్తుంది.
హోళీ పండుగ ముందు రోజున హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్, లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని పిలుస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హోలిక దహన్ను కామ దహనం అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, తన అపార భక్తి ఫలితంగా ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. హోళీ పండుగ శీతాకాలం చివర్లో ఫాల్గుణ పౌర్ణమి రోజున(ఫిబ్రవరి-మార్చి) జరుపుకుంటారు.
హోలికా దహనం
హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. ఈ విధానం హోళీ ముందురోజు చలిమంటలు వేయడానికి కూడా పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం రాక్షసి హోలీక దహనం. మన పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుణ్ణి చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా, విజయదశమి రోజున రావణుని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా హోలిక ప్రతిమను దహనం చేస్తారు, రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతమయిందని పండుగ పరమార్థంగా వివిధ ప్రాంతాల ప్రజలు భావిస్తారు. కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు.సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణలు చేస్తారు. తరువాతి రోజు ఈ విజయాన్ని దుల్హెండి పేరుతో ఘనంగా జరుపుకొంటారు. రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని ''పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు.
దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుని సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువునే ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
చివరిగా ప్రహ్లాదుని తన యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపిస్తాడు హిరణ్యకశిపుడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను హోలిక ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని శ్రీమహావిష్ణువును వేడుకుంటాడు. విష్ణుమూర్తి అనుగ్రహంతో మంటలు మొదలైన తరుణంలో హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిపై పడడంతో అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోళిని జరుపుకుంటున్నాము.
వసంతానికి ఆహ్వానం
మధురలో 16 రోజుల పండుగఈ పండుగను భగవంతుడైన కష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర మరియుబృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. భగవంతుడైన కష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని, రాధ ముఖానికి కూడా రంగు పూయాలని కష్ణుడి తల్లిచెప్పిందని కొన్ని కధలు పేర్కొంటున్నాయి.
హోళీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ
ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి పరమేశ్వరుని పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి వెళ్ళాడు కామదేవుడు. తనపై పూల బాణం వదిలినందుకు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు శివుడు. అనంతరం వృత్తాంతం తెలుసుకుని కామదేవుని భార్య రతి కోరికమేరకు శివుడు కామదేవుడిని మళ్ళీ బ్రతికిస్తాడు, కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరితప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారని మరో కధా సారాంశం.దేశంలో వివిధ ప్రాంతాల్లో హోళీ వేడుకలు
ఒరిస్సా: ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు.గుజరాత్: గుజరాత్లో చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలు వేసి దాని చుట్టూ చేరి నత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి సామూహికంగా కూడా మంటలు వేస్తారు. ఈ మంటల్లో ఇంట్లో ఉన్న పాత చెక్క సామానులన్నీ తీసుకొచ్చి వేస్తారు.
మహారాష్ట్ర: మహారాష్ట్రలో హోలిక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. ఒక వారం ముందు నుండి యువకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
మణిపూర్: మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు.
కాశ్మీర్: సైనికుల పహారాలో, తుపాకుల చప్పుళ్ళతో ఉద్రిక్తంగా ఉండే అందాల కాశ్మీర్లో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు. ఆటపాటలతో రంగు నీటిని ఒకరిమీద మరొకరు చల్లుకుంటారు.
లాఠీలతో కొడతారు
ఉత్తర ప్రదేశ్ లోని మథురకు దగ్గరగా ఉన్న, రాధాదేవి జన్మస్థలమైన బర్సన అనే ప్రాంతంలో హోళీని వెరైటీగా జరుపుకుంటారు. అక్కడ హోళీ సందర్భంగా మహిళలు మగవారిని లాఠీలతో పిచ్చ కొట్టుడు కొడతారన్న మాట. దీన్నే వారు లఠ్ మార్ హోలీ అని ముద్దుగా పిలుచుకుంటారు. లఠ్ అంటే లాటీ అని అర్థమట. దీనికి ఓ ప్రత్యేక కారణముంది. పురాణ కాలములో చిలిపి కృష్ణుడు, తనకెంతో ఇష్టమైన రాధ గ్రామానికి వచ్చి, అక్కడ ఆమెను, ఆమె స్నేహితురాళ్ళను ఆటపట్టించాడట. దీనిని తప్పుగా భావించిన ఆ గ్రామం మహిళలు, కర్రలతో కృష్ణయ్యను వెంట తరిమారట.అప్పటినుండి, ఈ పండగ ఇలా జరుపుకోవాడం జరుగుతోంది. పక్కనే ఉన్న కృష్ణునిగ్రామం, నంద్గావ్ నుండి మగవారు హోళీ ఆడడానికి ఈ గ్రామం రావడం, హుషారుగా హోళీ పాటలు పాడడం, ఆడవారిని రెచ్చగొట్టడం వారిచేతిలో లాఠీ దెబ్బలు తినడం ఆనవాయితీ అన్న మాట. కాకపోతే, ఆడవారు కొట్టే దెబ్బలను వారు ఢాలు వంటి దానిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆడవారు కూడా వారిని ఢాలు మీదనే ఎక్కువగా కొడతారు.
ఈ హోళీకి నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లను ప్రారంభించడం జరుగుతుంది. అత్తలు తమ కోడళ్ళకు ఆ నెల రోజుల మంచి పౌష్టిక ఆహారం పెడతారట, బాగా కొట్టడానికి. ఇక్కడ కొట్టడం అనేది వారిని గాయపరచడానికి కాదు, వారి పట్ల తమ ప్రేమను చెప్పడానికి మాత్రమే అని చెబుతారు గ్రామస్తులు. ఇలాంటిదే మరో హోళీ హర్యానాలో జరుగుతుంది. దాని పేరు ''కరోర్ మార్'' హోళీ.
ఇక్కడ వదినలు (మరదళ్ళూ కూడా నేమో) మరిదిని (బావను కూడా) పిచ్చ కొట్టుడు కొట్టడం స్పెషాలిటీ. సంవత్సరమంతా వారు తమ మీద వేసిన జోకులకూ సెటైర్లకూ, టీజింగులకు ఆరోజు కసి తీర్చుకుంటారన్న మాట. ఇది కేవలం కుటుంబమంతా తమ విభేదాలను మర్చిపోయి, కలిసి మెలసి జీవించడానికి చేసుకునే పండగ అని, ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయమనీ చెబుతున్నారు. విశేషమేమిటంటే, లాఠ్ మార్ హోళీ లా ఇక్కడ మగవారు ఢాలు లాంటివి తెచ్చుకోరు, ఆడవారు కూడా కేవలం దెబ్బలు తగలకుండ కొట్టడం అనే కాన్సెప్టును ఫాలో అవ్వరు. ఏది దొరికితే అది అడ్డుపెట్టుకొని తప్పించుకోవాలి, లేదా తన్నులు తినాలి.