వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి ఒంటిమిట్ట రామాలయానికి నూతన హంగులు :టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌


టిటిడికి అనుబంధంగా గల కడప జిల్లా ఒంటిమిట్టలోని ప్రాచీనమైన శ్రీ కోదండ రామాలయానికి వచ్చే వార్షిక బ్రహ్మూెత్సవాల నాటికి నూతన హంగులు సమకూరుస్తామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. టిటిడి ఈవో గురువారం తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి భారత పురావస్తు శాఖ నుంచి అనుమతులు లభించాయని తెలిపారు. ఇందుకోసం ఒక సంవత్సరం పాటు న్యూఢిల్లీలోని ఆ శాఖ అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేపట్టామని వివరించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌ డిజైన్లు 15 రోజుల్లో పూర్తవుతాయని, ఆ తరువాత రెండు దశల్లో పనులు చేపడతామని తెలిపారు. 

మొదటి దశలో భక్తులకు పటిష్ట దర్శన ఏర్పాట్లు, టికెట్‌ కౌంటర్లు, తాగునీటి వసతి, ఆలయ పరిసరాల్లో మొక్కల పెంపకం, పుష్కరిణి, విశ్రాంతిగృహాలు, లాకర్లు, మరుగుదొడ్లు తదితర అత్యవసర పనులను వచ్చే బ్రహ్మూెత్సవాల నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇతర అభివృద్ధి పనులను రెండో దశలో చేపడతామని తెలిపారు.

అంతకుముందు నిర్మాణంలో ఉన్న యాత్రికుల వసతి సముదాయం పనుల నాణ్యతను పరిశీలించారు. నిర్ణీత వ్యవధిలో ఈ పనులను పూర్తి చేయాలని చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా, ఆలయ పరిసరాలు, కల్యాణవేదిక తదితర ప్రాంతాలను ఈవో పరిశీలించారు.