పురుహూతికా శక్తి పీఠం పిఠాపురం కుక్కుటారామం



తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పిఠాపురం. పూర్వం దీన్ని పిష్టాపురం అని పిలిచేవారు. ఇక్కడ పురుహూతికా శక్తి పీఠం ఉంది. అందుకే ఇది పిఠాపురం అయింది. వ్యాసుల వారు శిష్య సమేతంగా ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిని, కుంతీమాధవ స్వామిని, పీఠికాంబికను, హుంకారిణీ శక్తిని సేవించారు.


కుంతీమాధవుని ఆలయంలో ఉన్న రాతి స్థంభంపై చాలా శాసనాలు ఉన్నాయి. ఇక్కడి పురుహూతికా శక్తి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. కుక్కుటేశ్వరుడు స్వయంభూ లింగము. లింగము కుక్కుటము(కోడి) ఆకారంలోఉంటుంది. అంటే లింగానికి రెండువైపులా రెండు రెక్కలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.


పూర్వం త్రిమూర్తులు గయాసురుడనే రాక్షసుని సంహరించగా అతని శిరస్సు, నాభి, పాదము మూడు ప్రదేశాల్లో పడ్డాయి. పాదము ఈ పిఠాపురంలో పడడంతో దీనికి ‘పాదగయ’ అనే పేరు కూడా ఉందని కొందరు చెపుతారు. అంతేకాక పిఠాపురం పంచారామాల్లో ఒకటైన ‘కుక్కుటారామం’గా కొందరు పేర్కొంటారు. ఈ క్షేత్రంలో శ్రీ వీరవేంకట కుమార త్రిముఖ లింగేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ సకలేశ్వరస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి.


ఇక్కడ ప్రవహిస్తున్న ఏలానదికి సాగర సంగమ యోగం లేదు. శివుడు కోడి రూపందాల్చి ఈ ఏలానదీ సాగర సంగమాన్ని ఆపినట్లు పురాణ గాధ .