తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 21వ తేదీన జరుగనున్న పుష్పయాగ మహోత్సవం పోస్టర్లను టిటిడి అధికారులు శుక్రవారం ఆవిష్కరించారు.
పుష్పయాగానికి జూన్ 20వ తేదీన సాయంత్రం 6.00 నుంచి 8.00 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగుతుంది. మే 21 నుండి 29వ తేదీ వరకు వరకు శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
జూన్ 21వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1.00 నుంచి 4.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవము, సాయంత్రం 5.30 గంటలకు వీధి ఉత్సవం జరుగనున్నాయి. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.516/- చెల్లించి ఈ యాగంలో పాల్గొనవచ్చని, గృహస్తులకు ఒక రవికె, ఉత్తరీయం బహుమానంగా అందజేస్తారని అధికారులు తెలిపారు.
Source