
తిరుపతి యాత్ర చేస్తున్నప్పుడు ప్రతీ భక్తుడు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయం నాగలాపురం వేదనారాయణ స్వామి ఆలయం. తిరుపతి-చెన్నై రహదారిలో పుత్తూరుకు 45 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది. శ్రీహరి మత్స్యావతారంలో వేదనారాయణుడుగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పురాణగాధ
ఈ క్షేత్ర చరిత్ర పురాణగాధలప్రకారం, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవద్ద నుంచి వేదాలను దొంగిలించి సముద్రగర్భంలో దాక్కుంటాడు. దీంతో బ్రహ్మ పరమేశ్వరునితో కలిసి శ్రీమన్నారాయణుని ఆశ్రయిస్తారు. వేదాల రక్షణకోసం శ్రీహరి మత్స్యావతారం ధరించి సముద్రగర్భంలో సంవత్సరాలపాటు సోమకాసురునితో యుద్ధం చేసి వేదాలను రక్షిస్తాడు. అందుకు ప్రతీకగా వేదనారాయణస్వామి ఆలయం మత్స్యావతార రూపంలో స్వామి మనకు దర్శనమిస్తారు.
శ్రీకృష్ణదేవరాయలు కుంభకోణంలో జరిగే ఉత్సవాలకు వెళుతూ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటాడు. ప్రయాణంలో భాగంగా నాగలాపురంలో బసచేసిన సందర్భంలో శ్రీవారు వేదనారాయణస్వామి రూపంలో శ్రీకృష్ణదేవరాయలకు కలలోకి వచ్చి తనకు సప్త ప్రాకారాలతో ఆలయాన్ని నిర్మించాలని చెపుతాడు. శ్రీకృష్ణదేవరాయలు తనతల్లి నాగులాంబ పేరుతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఆ నాగలాంబ పేరే ఇప్పుడు నాగలాపురంగా పేరుపొందిందని చెబుతున్నారు.

స్వామిని తాకే సూర్య కిరణాలు
నాగలాపురం ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ప్రతీ ఏడాది మార్చి ఆఖరువారంలో 23 నుంచి 28 వ తేదీ మధ్యలో సాయంకాలం సూర్యకిరణాలు మూడురోజులపాటు స్వామి వారిని స్పృశిస్తాయి. మొదటి రోజు పాదాలమీద, రెండవరోజు నాభిమీద, మూడవ రోజు శిరస్సును సూర్యకిరణాలు తాకుతాయి. ఈ కిరణాలు సుమారు 630 మీటర్ల ఎత్తున్న రాజగోపురం మీద నుంచి స్వామి మూలవిరాట్టుకు చేరుతాయి. ఈ అద్భుతదృశ్యం తిలకించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. ఈ సూర్యకిరణాలుతాకే రోజుల్లో సూర్యపూజోత్సవాలను ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. సముద్రంలో సంవత్సరాల పాటు పోరాటంచేసిన స్వామివారికి వెచ్చదనాన్ని కలిగించి సేదతీర్చడంకోసమే సూర్యుడు తన కిరణాలను స్వామివారిపైకి ప్రసరింపచేస్తాడని భక్తుల నమ్మకం. సూర్యపూజోత్సవాలతో పాటు ఆలయంలో మత్స్యజయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని మీరు కూడా సందర్శించి తరించండి.