నారాయణవన౦: పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణ౦ జరిగి౦ది ఇక్కడే...

తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివ్య క్షేత్రం నారాయణవనం. శ్రీవారు పద్మావతీ దేవిని వివాహం చేసుకున్న ఈ ప్రాంతం ఎ౦తో మహిమాన్వితమైనది. ఈ క్షేత్రంలో స్వామి  పద్మావతీ సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామిగా పూజల౦దుకు౦టున్నాడు. ఇక్కడ స్వామి ఒక భిన్న రూపంలో మనకు దర్శనమిస్తాడు. తూర్పుముఖంగా ఉండే శ్రీవారు ఒకచేత కళ్యాణ కంకణాన్ని, మరొక చేత వేటఖడ్గాన్ని ధరించి ఉంటారు. 

నారాయణవన౦ క్షేత్ర పురాణగాధ

నారాయణవనాన్ని ఆకాశరాజు పరిపాలిస్తుంటాడు. తనకు సంతానం లేని కారణంగా సంతానయాగం చేయడానికి ఉపక్రమించిన నేపధ్యంలో ఒకరోజు పొలంలో నేల చదును చేస్తుండగా ఆకాశరాజుకు ఒక పెట్టెలభిస్తుంది. తెరిచి చూడగా ఒక శిశువు కనిపిస్తుంది. తనకు ఆ శిశువు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెకు పద్మావతీ దేవిగా నామకరణం చేసి పెంచుకుంటాడు. నారాయణవనంలో పద్మావతీ అమ్మవారిని శ్రీవారు వివాహం చేసుకునేందుకు దారితీసిన సందర్భాలను పురాణాలు ఈ విధంగా పేర్కొంటున్నాయి. తిరుమల గిరుల నుంచి శ్రీవారు ఒకసారి ఒక మద గజం పొగరు అణచేందుకు దాన్ని తరుముకుంటూ వస్తూ నారాయణవనం చేరుకుంటారు. అక్కడే చలికత్తెలతో విహరిస్తున్న పద్మావతీ అమ్మవారిని స్వామివారు చూసి ఇష్టపడి ఆమె తండ్రి ఆకాశరాజును కలిసి తన మనోభీష్టాన్ని వ్యక్తం చేయగా ఇరువురి వివాహానికి ఆకాశరాజు అంగీకరించి నారాయణవనంలోనే వివాహం జరిపించాడు. అందుకుగుర్తుగా ఆకాశరాజు ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వరస్వామిఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి, అమ్మవారి వివాహం జరిగినప్పటి నలుగుపిండి తిరగలిని కూడా మనం చూడవచ్చు. 

ఆలయం కలియుగ ప్రారంభం నాటిది

విశాలమైన ప్రాకారాలతో, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక దర్శించుకోవాలి. తిరుపతి-చెన్నై రహదారిలో తిరుపతికి 45 కిలోమీటర్లదూరంలో ఈ ఆలయం మనం దర్శించుకోవచ్చు.తిరుమల తిరుపతి యాత్ర చేస్తున్న ప్రతీ భక్తుడూ విధిగా దర్శించాల్సిన క్షేత్రం నారాయణవనం.