
తిరుపతికి దగ్గరలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ ఆలయం అప్పలాయగుంట ప్రసన్న వేంకంటేశ్వరస్వామి ఆలయం. తిరుపతికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న ఈ క్షేత్రంలో స్వామివారు పద్మావతీ సమేతులై ప్రసన్న రూపంలో అనుగ్రహిస్తారు.

క్షేత్ర ప్రాధాన్యత
నారాయణవనంలో పద్మావతీ అమ్మవారిని వివాహం చేసుకున్న శ్రీనివాసుడు అమ్మవారితో కలిపి తిరుమల గిరులకు ప్రయాణం అవుతాడు. మార్గమధ్యంలో అప్పలాయగుంట వద్ద తపస్సు చేసుకుంటన్న సిద్ధేశ్వరుడుఅనే ఒక యోగి స్వామి అమ్మవార్లకు స్వాగత సత్కారాలు చేయగా ఆయన ఆతిధ్యాన్ని తీసుకుంటారు స్వామి. కొన్నాళ్ళు అప్పలాయగుంటలో గడిపారు స్వామి. సిద్ధేశ్వరుని కోరికమేరకు ప్రసన్న వేంకటేశ్వరునిగా భక్తులకు ఈ క్షేత్ర౦లో కొలువుదీరారు. ఇక్కడ స్వామి ప్రసన్నమూర్తిగా భిన్న ఆకృతిలో భక్తులను అనుగ్రహిస్తారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి వరద హస్తాన్ని ధరిస్తే ఇక్కడ స్వామివారు అభయహస్తంతో భక్తులకు దర్శనమిస్తారు.