ఘనంగా శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం

 

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి పేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. మాఘపౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను కూపుచంద్రపేట గ్రామానికి ఊరేగింపుగా తీసుకెళ్లడం ఆనవాయితీ.

ఉదయం 6 గంటలకు ఆలయం నుండి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపు బయల్దేరింది. ఉదయం 8.30 గంటలకు తిరుపతికి 8 కిలోమీటర్ల దూరంలో గల కూపుచంద్రపేటకు చేరుకుంది. అక్కడ ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు అక్కడి నుండి బయల్దేరి రాత్రి 9 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం జరిగిన స్వామివారి ఊరేగింపులో టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి పాల్గొన్నారు.