తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో గురువారం ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలలో భాగంగా ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు పల్లకి ఎక్కి ఆలయ ప్రాంగణంలోని కుంభహారతి మండపం వద్దకు, అమ్మవార్లు చెరొక పల్లకిపై స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరఫున జియ్యంగారు పూలచెండ్లతో విహారయాత్రకు వెళ్లి వచ్చిన స్వామివారిని మూడుసార్లు తాడించారు. స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమి తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడతారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఆస్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.