చంద్రగిరి మండలం కందులవారిపల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25 నుండి 27వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగనుంది.
ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు కలశ స్థాపన, గణపతి, నవగ్రహ, రుద్ర దుర్గ హోమాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరస్వామివారికి అభిషేకం జరుగనుంది. ఉదయం 5.30 నుండి 7 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు శ్రీ శేషాచల లింగేశ్వరస్వామివారికి, శ్రీ నందీశ్వరస్వామివారికి అభిషేకం చేస్తారు. రాత్రి 7 నుండి 12 గంటల వరకు హరికథ, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 12.10 నుండి ఉదయం 4 గంటల వరకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 9.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు గ్రామోత్సవం నిర్వహిస్తారు.