శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం 8.40 నుండి 9.40 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పెద్దలవాక్కు.
రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఫిబ్రవరి 26న చక్రస్నానం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 9 నుండి 10 గంటల వరకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు శాస్త్రోక్తంగా చక్రస్నానం జరుగనుంది.