తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం మండంలోని ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వార్లు ప్రతిష్టింపబడి ఉన్నారు. ఈ గ్రామం కాకినాడకు 32 కి.మీ, రాజమండ్రికి 60 కి.మీ దూరంలోను ఉంది. ఈ దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటి. మన రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్ర త్రయంలో ఈ ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాల్లో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, రెండవది శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాసకాశీగా ద్రాక్షారామానికి గొప్ప పేరు ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ.7, 8 శతాబ్దాల మధ్యకాలంలో తూర్పుచాళుక్యుల వంశానికి చెందిన చాళుక్యభీముడు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలోని మూలవిరాట్ శ్రీ భీమేశ్వరస్వామి. ఈయన స్వయంభువుగా వెలసిన 14 అడుగుల,శుద్ధ స్ఫటికాకార లింగం. ఈ స్వామివారి దేవేరి మాణిక్యాంబాదేవి. ఈ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠంగా పూజలందుకుంటోంది. దక్షప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశాడు కనుక ద్రాక్షారామం అన్నపేరు వచ్చిందని ప్రతీతి.
స్థలపురాణం
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ గర్వంతో దేవతలను, మునులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెడుతూ ఉండగా ఆ బాధలు భరించలేక వీరంతా మహావిష్ణువును శరణువేడుకున్నారు. తారకాసురుని మెడలోని శివుని ఆత్మలింగం తొలగితే కానీ ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా అతడు మరణం లేకుండా వరం పొందాడని చెప్పాడు. మన్మధ ప్రేరేపణ చేత పార్వతీ కళ్యాణం, అనంతరం ‘కుమారసంభవం’ జరిగాయి. శ్రీ కుమారస్వామి రుద్రగణముకు నాయకత్వం వహించి తారకాసురునితో యుద్ధం చేశాడు. ఆయన ఎక్కుపెట్టిన బాణం తారకాసురుని మెడలోని శివుని ఆత్మలింగానికి తగిలి అది ఐదు ముక్కలై భూమిమీద ఐదు చోట్లపడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించాయి. ఇలా భూమిమీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాని అతివేగంగా ఎదగడం ప్రారంభించాయి. ఇలా ఆత్మలింగాలు ఆకాశంవైపుకు ఎదిగిపోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి ఆ దివ్యలింగాలకు అభిషేకాలు గాని, దర్శనానికి గాని మానవులకు అందకుండా పోతాయని ఐదుచోట్ల పడిన ఆత్మలింగాలను ఐదుగురు దేవతలు అవి ఎదిగిపోకుండా ప్రతిష్టచేసి అభిషేకార్చనలు చేశారు. ఏ దేవతామూర్తి అయితే ప్రతిష్ఠ చేశారో ఆ శివలింగం ఆయా దేవుని పేరుతో పిలువబడుతోంది.
ద్రాక్షారామంలోని ఆలయం సుమారు 100 గజాలపొడవు ఉండి, దాదాపు ఆరడుగుల ఎత్తు ఉన్న పునాదిపై నిర్మించబడిరది. స్వామివారి గర్భాలయం రెండు అంతస్థులుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడిస్వామివారి మూలవిరాట్ విగ్రహం పదకొండు అడుగుల ఎత్తు ఉన్నందువ్ల ఆలయపు కింది అంతస్థులో పానపట్టము, పై అంతస్థులో లింగం యొక్క శిరోభాగము దర్శనమిస్తాయి. పై అంతస్థులోనే అభిషేకాలు కొనసాగుతాయి. ఈ శివలింగం సగభాగం నల్లగాను,, సగభాగం తెల్లగాను ఉంటుంది. అర్ధనారీశ్వరుడు అనటానికి ఇది నిదర్శనం అంటారు. గర్భాలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి.
భక్తులను నాలుగువైపులా కూర్చుండబెట్టి లోపల స్వామివారికి అభిషేకము, పూజలు చేస్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీలక్ష్మీ నారాయణుడు. స్వామివారి ఆలయానికి ఎడమ వైపున ఆవరణలో అమ్మవారి ఆలయం ఉంది. మాఘశుద్ధ పౌర్ణమినాడు శివునకు, లక్ష్మీ నారాయణులకు ఒకేసారి, ఒకే వేదికపై కళ్యాణాలు జరగడం ఈ ఆలయంలో ప్రత్యేకత. ఈ ఆలయ ఆవరణలో సప్తగోదావరి అనే పుష్కరిణి ఉంది. సప్తర్షులైన అత్రి, కశ్యప, గౌతమ, జమదగ్ని, వశిష్ట, భరద్వాజ, విశ్వామిత్రులు మొదలైనవారు ఈ ఆలయానికి ఒక పుష్కరిణి నిర్మించి తమ తపోశక్తితో గోదావరిని అంతర్వాహినిగా ప్రవహింపచేసి ఆ పవిత్రజలంతో పుష్కరిణి నింపారు. అందువల్లనే దీన్ని ‘సప్తగోదావరి’ పుష్కరిణి అని పిలుస్తారు.
మాణిక్యాంబిక అన్న బాలిక స్వామికి తనను తాను అర్పించుకుని ఆయనకు దేవేరి అయినట్లు భీమేశ్వర దండకంలో ఉంది. మాణిక్యాంబ ఆలయం కూడా ఇక్కడ ఉంది. ఈమె పరాశక్తి మరో అవతారం. స్వామివారి ఊరేగింపు మాణిక్యాంబ దేవి ఆలయం చుట్టూ త్రిప్పి తీసుకువెళ్లడం ఆచారం. నిత్య పూజలతో పాటు, పండుగలు, పర్వదినాల్లో అభిషేకాలు, పూజలు విశేషంగా జరుగుతాయి. మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ సమయంలో భక్తులసంఖ్య విశేషంగా ఉంటుంది.