తిరుమలలో ఘనంగా హనుమత్ జయంతి మహోత్సవాలు

హనుమంతుడు అంజనాద్రి ఆకాశగంగలో జన్మించినట్లు రాయల్ చెరువు శక్తి పీఠం మాతృశ్రీ రమ్యానంద భారతి పేర్కొన్నారు. అంజ‌నాదేవికి వాయుదేవుని వలన తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపార‌న్నారు. హనుమత్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జరిగిన  కార్యక్రమంలో మతంగ మహర్షి చెప్పినవిధంగా అంజనాదేవి వేంకటాచలానికి విచ్చేయడం, అక్కడ తపస్సు చేసుకోవడం, ఆంజనేయస్వామికి జన్మనివ్వడం, తదనుగుణంగా ఆ కొండకు ‘అంజనాద్రి’ అని పేరు రావడం వంటి ఎన్నో విషయాలను తెలియచేసారు.

సకల దేవతల ఆరాధనకు హనుమంతుని ఆశ్రయించడం ఒక్కటే మార్గమని, తద్వారా సకల శుభాలు చేకూరుతాయని శ్రీనివాసమంగాపురం శ్రీ వశిష్టాశ్రమ శ్రీ లలితా పీఠం వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామిజీ సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉద్ఘాటించారు. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల ద్వారా ఆంజనేయస్వామి యుగయుగాలకు ఆదర్శప్రాయం అన్నారు. హనుమంతుని అపారమైన భక్తి, కార్యదీక్ష, ధైర్య సాహసాలతో భక్తలోకానికి ఆరోగ్య ప్రదాతగా మారారని తెలియజేశారు.

జననీ అంజనా సమేత బాలాంజనేయస్వామి వారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన మహాత్ముల సందేశం కార్యక్రమంలో కడపకు చెందిన రామకృష్ణ మఠం ప్రధాన కార్యదర్శి శ్రీ అనుపమానంద మహారాజ్ తిరుమలలోని నాద నీరాజన మండపంలో అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతుడు శక్తి, సంకల్ప శక్తి, విధేయత, నిజాయతీకి చిహ్నం అని యువతకు ఆదర్శనీయుడని ఉద్ఘాటించారు .

హనుమత్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం, సోమవారం, మంగళవారం తిరుమ‌ల‌లోని నాదనీరాజనం, ఆకాశ‌గంగ‌, జ‌పాలి తీర్థంలో నిర్వ‌హించిన ఆధ్యాత్మిక, భ‌క్తి సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా  ఆక‌ట్టుకున్నాయి.

ఆకాశగంగలో

ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద శ‌నివారం ఉదయం 10 నుండి 11.30 గంటల వ‌ర‌కు జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం అధ్యాప‌కులు ఆచార్య రాఘ‌వాచార్యులు హ‌నుమంతుని జ‌న్మ విశేషాలు తెలిపారు.

తిరుమ‌ల‌లో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామి జ‌న్మ స్థ‌ల‌మైన ఆకాశ‌గంగ‌లో శ్రీ అంజ‌నాదేవి స‌మేత శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యంలో మంగళవారం ఉద‌యం స్వామివారికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన‌ చామంతి పుష్పాల‌తో విశేష సహస్ర నామార్చనను అర్చకులు నిర్వహించారు.

ఈ సందర్భంగా టీటీడీ వైఖాన‌స ఆగ‌మ‌స‌ల‌హాదారు శ్రీ మోహ‌న‌రంగాచార్యులు సంతానం, భూవివాదాలు, తదితర సమస్యలు తొలగిపోవాలంటే హనుమంతుని సేవించడం శ్రేష్టమని, ఆంజనేయస్వామి వైభవం గురించి వివరించారు. అనంతరం స్వామివారికి పంచామృత స్న‌ప‌న తిరుమంజ‌నం జరిగింది.

జపాలి క్షేత్రంలో

జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 8 నుంచి 10 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి రేవతి బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ రవి సుబ్రహ్మణ్యం గాత్ర సంగీతం నిర్వహించారు.

అనంతరం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ప్ర‌స‌న్న ల‌క్ష్మీ బృందం హనుమాన్ చాలీసా ప‌ఠించారు. సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సరస్వతీ ప్రసాద్ హ‌రిక‌థ గానం చేశారు.