శ్రీ తాళ్లపాక అన్నమయ్య ఆనాడు జనబాహుళ్యంలో ఉన్న అచ్చ తెలుగు పదాలతో తిరుమల శ్రీవారిపై వేలాది సంకీర్తనలు రచించారని ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో నిర్వహిస్తున్న సాహితీ సదస్సులు ఆదివారం మూడవ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య రాణి సదాశివమూర్తి “అన్నమయ్య – పద సౌందర్యం ” అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాడు పండితుల భాషగా ఉన్న సంస్కృతాంధ్ర పదాలను కాకుండా, సాధారణ జనం మాట్లాడే భాషతో, రాయలసీమలోని మాండలికాలతో కీర్తనలు రచించినట్టు చెప్పారు. దీన్ని బట్టి అన్నమయ్యను వ్యవహారిక భాషోద్యమానికి ఆద్యుడని భావించవచ్చన్నారు. అన్నమాచార్యులు తెలుగు పద సాహిత్యానికి ఆద్యుడని, ఆయన పద సంపదను భావితరాలకు అందించాలన్నారు.
తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డా|| దక్షిణామూర్తి ”అన్నమయ్య – సంస్కృత కీర్తనలు” అనే అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య అలతి అలతి పదాలతో దాదాపు 90 సంకీర్తనలను సంస్కృతంలో రచించినట్టు చెప్పారు. సంస్కృత కవులకు తెలుగు భాష రాకపోయినా పరవాలేదని, తెలుగు కవులకు మాత్రం తప్పకుండా సంస్కృతం తెలిసి ఉండాలన్నారు. అన్నమయ్య పద ప్రయోగ నిపుణత అనితర సాధ్యమన్నారు. సరళమైన సంస్కృతంలో తెలుగు వారికి సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారని తెలిపారు.
తిరుపతికి చెందిన ప్రసిద్ధ సాహితీవేత్త శ్రీమతి శ్రీదేవి ”అన్నమయ్య – సూక్తి వైభవం” అనే అంశంపై మాట్లాడుతూ, ధర్మం, నీతి, సత్య సన్నిహితమైన వస్తువును తత్వపరంగా ఉపదేశించినప్పుడు సూక్తి అవుతుందన్నారు. సాహిత్యంలో 23 రకాల సూక్తులు ఉన్నట్లు, జీవిత అనుభవాన్ని ఒక వాక్యము, శ్లోకము, పద్యము, కీర్తనల రూపంలో చెప్పినప్పుడు మనుషులకు చేరువవుతుందని తెలిపారు. అన్నమయ్య సాహిత్యంలో నైతిక, భక్తి, సంస్కరణ పరమైన ఎన్నో సూక్తులు ఉన్నట్లు ఆమె వివరించారు.
అంతకుముందు ఉదయం 9 గంటలకు తిరుపతికి చెందిన శ్రీ చంద్రశేఖర్ బృందం హరికథ గానం చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నంకు చెందిన శ్రీమతి సుధారాణి బృందం గాత్ర సంగీత సభ నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డా||విభీషణ శర్మ, ఉప సంపాదకులు డా|| నరసింహాచార్యులు, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.