ఘనంగా ముగిసిన శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు

 

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో భైరవి, నళినకాంతి, శంకరాభరణం, హిందూస్థాని, ఖరహరప్రియ,నీలాంబరి రాగాలను సుమధురంగా పలికించారు.

తర్వాత బెంగళూరుకు చెందిన శ్రీ రఘురామకృష్ణ బృందం వేంకటాచల నిలయం, తందనానా ఆహి వంటి…. అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన, భాగ్యద లక్ష్మీ బారమ్మ, దాసన మాడికో ఎన్న స్వామీ…వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.

అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి.