వాహనసేవల్లో భక్తులను కటాక్షిస్తున్న గోవిందుడు

 సింహ వాహనంపై అనంతతేజోమూర్తి

 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం ఉదయం అనంతతేజోమూర్తి  శ్రీ గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.

ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

మృగాల్లో రారాజు సింహం. గాంభీర్యానికి చిహ్నం సింహం. యోగశాస్త్రంలో సింహం వాహనశక్తికి, శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. స్వామివారు రాక్షసుల మనసులలో సింహంలా గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం కీర్తిస్తోంది.

అనంతరం ఉదయం 9.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు.

ముత్య‌పుపందిరి వాహనంపై గోవిందుడి కటాక్షం

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శ‌నివారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవిందరాజస్వామివారు ముత్య‌పుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది.

ముత్య‌పు పందిరి – స‌క‌ల సౌభాగ్య సిద్ధి

నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు పూటకొక అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది. వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి పాల్గొన్నారు.