తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజైన శనివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణివాసన్ గురుకుల్ ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఆనంతరం తిరుచ్చిపై స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
త్రిశూలస్నానం
బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన మార్చి 10వ తేదీ ఆదివారం త్రిశూలస్నానం వైభవంగా జరిగింది. ఉదయం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు త్రిశూలస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. సాయంత్రం 6 నుండి రాత్రి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా రాత్రి 8 నుండి 10 గంటల వరకు రావణాసుర వాహనసేవ జరుగనుంది.