శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.
అంతకుముందు ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 9.45 గంటలకు చక్రస్నానం ఘనంగా జరిగింది.
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నానం జరిగింది. ఇందులో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.
ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు.
సాయంత్రం 6 నుండి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిసాయి.