అంగరంగ వైభవంగా కపిలతీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

మహాశివరాత్రిని పురస్కరించుకుని తిరుపతిలోని కపిలతీర్థంలో కొలువైన కపిలేశ్వరస్వామికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల వాహనాలపై స్వామి కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. 

చందప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామి వారి అభయం

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన శనివారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.

 చంద్రప్రభ వాహనం విశిష్టత

శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశం, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.

భూత వాహనంపై శ్రీ కామాక్షి సమేత సోమస్కందమూర్తి

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం  ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనంలో కొలువుదీరిన స్వామికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. 

 భూతవాహన సేవ విశిష్టత

పూర్వం క్రూరభూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకొన్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మసృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి ”భూతపతి”గా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చారు.

 స్నపన తిరుమంజన సేవ

అనంతరం ఆలయంలో స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీసోమస్కంద మూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.