అంగరంగ వైభవంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు

సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’ ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. మధ్యాహ్నం స్వామి పుష్కరిణిలో చక్రస్నానం వేడుకగా జరిగింది. అంతకుముందు ఉదయం చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షించారు.

చిన్నశేషవాహనంపై స్వామివారి కటాక్షం

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

 శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం 

మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

శ్రీవారి చక్రస్నానం

రథసప్తమిరోజు  మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్య చక్రస్నానం వైభవంగా జరిగింది. శ్రీవరాహస్వామివారి ఆలయం వద్ద గల స్వామిపుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. అధికారులు, భక్తులు పుష్కరిణిలో పవిత్రస్నానాలు ఆచరించారు.

కల్పవృక్ష వాహనం 

రథసప్తమిరోజున సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు శ్రీమలయప్పస్వామివారు  ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం

సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీవారు సర్వభూపాల వాహనంపై విహరించి కన్నులవిందు చేసారు. 

చంద్రప్రభ వాహనం 

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. రథసప్తమి రోజు రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు.