రథ సప్తమి రోజున భక్తులకు శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం

 

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్లు వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు.

అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి. వరుసగా సూర్యప్రభ, హంస, హనుమంత, పెద్దశేష, ముత్యపుపందిరి, సర్వభూపాల వాహనాలపై స్వామివారు భక్తులకు కనువిందు చేశారు.