తిరుమల శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర సోమవారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించారు.
టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవనాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.
ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పేష్కర్ శ్రీ శ్రీహరి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు.
ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.