మారుమూల గ్రామాలకు ధర్మప్రచారాన్ని వ్యాప్తి చేయాలని, ఘర్ వాపసి లాంటి కార్యక్రమాల ద్వారా మతం మారిన వారిని తిరిగి ఆహ్వానించాలని పలువురు స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సులో రెండో రోజైన ఆదివారం మధ్యాహ్నం పలువురు స్వామీజీలు వర్చువల్ గా పాల్గొన్నారు.
శ్రీ రవిశంకర్ గురూజీ, బెంగళూరు
సనాతన ధర్మ వ్యాప్తికి తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోంది. యువతను ధర్మం వైపు నడిపించాల్సిన సమయం ఆసన్నమైంది. ధర్మ పరిరక్షణలో యువత ప్రాధాన్యత ఎంతో ఉంది. గ్రామాలలో పూజారులకు వైదిక పూజా కార్యక్రమాల విషయంలో శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది. పట్టణాలు, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో జానపద గీతాలు, యక్షగానం, భజనలు, కీర్తనల ద్వారా విస్తృతంగా ధర్మప్రచారం జరిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోవాలి. అన్మయ్య కీర్తనలు, భక్తి గీతాలాపన ద్వారా నాస్తికులు ఆస్తికులుగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది.
శ్రీ విద్యాశంకర భారతి స్వామి, పుష్పగిరి మఠం, కడప జిల్లా
యజ్ఞాలు, పూజా కార్యక్రమాలు, ఆలయాలు పెరుగుతున్నాయి. సంప్రదాయాల పరిరక్షణ కోసం అందరూ పని చేయాలి. టీటీడీ అద్భుతమైన ధార్మిక కార్యక్రమాలను చేపడుతోంది. ధార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాలు అమలుపరచాలి.
శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ, కంచి కామకోటి పీఠం
టీటీడీ నిర్వహిస్తున్న ధర్మ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఉత్తర దేశంలోని ప్రాచీన ఆలయాల్లో కూడా ధార్మిక ప్రచారం జరగాలి. భక్తులు తిలకధారణ చేయడం ద్వారా హైందవ ధర్మ వ్యాప్తికి కృషి చేయాలి. టీటీడీ ధర్మ ప్రచార విస్తృతికి మరింత కృషి చేసి గ్రామస్థాయి నుండి పైస్థాయికి తీసుకు వెళ్లాల్సి ఉంది. తిరుపతిలో శ్రీ కరుణాకర రెడ్డి మంచి రోడ్ నిర్మాణం చేసి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి మార్గంగా నామకరణం చేయడం ప్రశంసనీయం. మతాంతీకరణ చెందిన హిందువులను తిరిగి సనాతన హిందూ ధర్మం వైపు తీసుకురావడానికి ఘర్ వాపసీని (మళ్లీ మన ధర్మంలోకి రావడం) ప్రోత్సహించాలి. ఛైర్మన్, ఈవో నేతృత్వంలో టీటీడీ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచార కార్యక్రమాలు చేస్తుండడం అభినందనీయం.
శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ, ఉత్తరాది మఠం, బెంగళూరు
వేద రక్షణ చేస్తే ధర్మ పరరక్షణ జరుగుతుంది. గోశాల, ఆయుర్వేద, వేద పాఠశాల వంటి ఎన్నో సంస్థలను టీటీడీ నిర్వహిస్తోంది. సనాతన, హిందూ ధర్మ ప్రచారాన్ని విశేషంగా పెంచాలి. ఇందుకోసం పీఠాధిపతుల సహకారం తీసుకోవాలి. ఆలయాల నిర్మాణం, భజన మండళ్ల ఏర్పాటు ద్వారా మతాంతీకరణను అడ్డుకోవాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు, స్వామి వారి ఫొటోలు పంపిణీ చేయాలి. పండుగలు, సంప్రదాయాల గురించి పిల్లలకు పరిచయం చేయాలి. శిల్పాలు, ఇతిహాసాలపై ప్రచారం జరగాలి.
శ్రీవన్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, అహోబిల మఠం
వేదాల్లో పేర్కొన్న విషయాలను ప్రచారం చేయాలి. వేదాల్ని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. వేద పారాయణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా వేద పండితులను ప్రోత్సహించాలి. టీటీడీ ఛైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు ఎంతో కృషి చేస్తున్నారు.
శ్రీ విజయదత్తానంద స్వామీజీ, ఉత్తరాధికారి, దత్త పీఠం, మైసూరు
శ్రీ వేంకటేశ్వరస్వామివారు ధర్మ స్థాపన కోసమే తిరుమలలో వెలిశారు. వేద శాస్త్ర సంరక్షణ చాలా అవసరం. గోవిందకోటి రాసిన భక్తులకు స్వామివారి దర్శనం ఆలోచన చాలా మంచిది. యువతీ యువకులకు ధార్మిక అంశాల్ని వేర్వేరు కార్యక్రమాల ద్వారా చేరవేయాలి. దేశ వ్యాప్తంగా 5 కోట్ల గీతా పుస్తక ప్రసాద పంపిణీ జరగాలి. సామాన్య జనంలోకి ధార్మిక కార్యక్రమాలను తీసుకెళ్లాలి.
శ్రీ ఈశప్రియ తీర్థ స్వామీజీ, అదమారు మఠం, ఉడుపి
హిందువులు వేదాలు, ఉపనిషత్తులకు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్కరికీ విద్య మహత్యం గురించి తెలియపరచాలి. జ్ఞాన సంపదలను పెంచుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద సంస్థ గ్రామాల్లోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయాలి. ఇంటింటికీ సనాతన సంప్రదాయాల గురించి తెలియపరచాలి.
వేదాలు తెలిసిన వాళ్లను ప్రోత్సహించాలి. అలాగే గో సంరక్షణ, ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరికీ జ్ఞాన సంపాద పెంచాలి. భగవంతుని అనుగ్రహం ప్రతి ఇంటికీ చేరేలా టీటీడీ ప్రోత్సహించాలి.
శ్రీ సుగుణేంద్రతీర్థ స్వామీజీ, పుత్తిగె మఠం, ఉడిపి
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు మంచి కార్యాన్ని చేపట్టారు. ఇతిహాస పురాణాలు యువత సన్మార్గంలో పయనించడానికి సహాయపడతాయి. మహాభారత, రామాయణం లాంటి ఎన్నో పుస్తకాలు యువతకు మార్గదర్శనం. పిల్లలకు ఇతిహాస పురాణాలను పరిచయం చేయాలి. ఈ విషయాలను టీటీడీ కార్యరూపంలోకి తీసుకొస్తుందని ఆశిస్తున్నాను.
శ్రీ విద్యాదీశ తీర్థ స్వామీజీ, ఉత్తరాది మఠం, ఉడిపి.
పాఠశాల విద్యార్థులకు ధర్మాన్ని బోధించే విధంగా పాఠ్యాంశాలు ఉండాలి. యోగ సాధన విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. సంస్కృత భాష ద్వారా హిందూ సనాతన ధర్మ వ్యాప్తి పెరుగుతుంది. సంస్కృతాన్ని అందరికీ నేర్పాలి. సనాతన ధర్మ పరిరక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోంది.
శ్రీ విదుశేఖర భారతీ తీర్థ స్వామీజీ, శృంగేరీ పీఠం ఉత్తరాధికారి.
ధార్మిక చింతన కోసం తిరుమల పుణ్యక్షేత్రంలో ధార్మిక సదస్సు నిర్వహించడం సంతోషకరం. వేద పరిరక్షణకు టీటీడీ చేపడుతున్న చర్యలను నా చిన్నతనం నుంచే చూస్తున్నా. సనాతన ధర్మానికి హాని కలిగించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మానికి హాని కలిగించడం అంటే తమకు తాము హాని చేసుకున్నట్టే. సనాతన ధర్మం వల్లే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని వారు గ్రహించాలి. సామాన్య ప్రజలకు కూడా సనాతన ధర్మం గురించి మరింత తెలియజేయాలి.
శ్రీ యదుగిరి యతిరాజ స్వామీజీ, శ్రీ యదుగిరి యతిరాజ మఠం, మేల్ కోటె
తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
శ్రీ రాఘవులు, విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి
పారాయణాల్లో మహిళల్ని బాగస్వాములను చేయాలి. ప్రచారకులను అన్ని ప్రాంతాలకు పంపి ధర్మ ప్రచారం చేయాలి. మత మార్పిడుల నివారణకు చర్యలు తీసుకోవాలి. యువత, బాలల్లో ధార్మిక ప్రచారం కోసం ఒక్కో స్వామీజీ ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలి.