హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలి-ధార్మిక సదస్సులో పీఠాధిపతులు

హిందూ సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పీఠాధిపతులు, మఠాధిపతులు ఏకం కావాలని, ఇందుకోసం టీటీడీ ముందు వరుసలో ఉంటుందని స్వామీజీలు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో జరుగుతున్న ధార్మిక సదస్సులో రెండో రోజైన ఆదివారం ఉదయం 17 మంది స్వామీజీలు పాల్గొన్నారు.

వెదురుపాక స్వామీజీ, విజయదుర్గ పీఠం

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా  దృష్టి సారించడం మంచి పరిణామం. భవిష్యత్తులో కూడా ఇదే తరహలో టీటీడీ మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా పయనించాలి. 

శ్రీ సుజయనిధి తీర్థ స్వామి, శ్రీపాదరాజ మఠం, ముళ్ భాగల్

 తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో ప్రత్యేకమైన స్థానంలో ఉంది. సనాతన ధర్మంలో ప్రతి ఒక్క పీఠాధిపతిని భాగస్వామిని చేయాలి. దేశంలోని ప్రతి ఇంటికీ సనాతన హిందూ ధర్మం, ఆచారాలు, సాంప్రదాయాల గురించి తెలియపరచడానికి కృషి చేయాలి.

శ్రీ ముకుందానంద మహరాజ్ – జ్యోతిర్ మఠం, ఉత్తరాఖండ్

సనాతన ధర్మం అంటే కేవలం మనుషులు మాత్రమే కాక పశుపక్షాదులు, వృక్షాలు, జంతువులు సమస్తం సుభిక్షంగా ఉండడం. ఆధునిక విద్యలో మన సనాతన హిందూ ధర్మం, సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికీ తెలియపరచాలి. గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.

శ్రీ మన్నార్ గుడి శాంతాలంకార షెన్ భాగమన్నార్ జీయర్ స్వామి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న మత మార్పిడులను నివారించడానికి టీటీడీ కృషి చేయాలి. ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం, గోసంరక్షణ కోసం టీటీడీ పని చేయాలి. వైద్య, విద్యా సంస్థల్ని మరింత విస్తృతం చేయాలి.

శ్రీ అనుపమానంద మహరాజ్, రామకృష్ణ సేవా సమితి, కడప

ధార్మిక సదస్సులో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను, సూచనలు, సలహాలను ఆమోదించి భవిష్యత్ తరాలకు ధర్మాన్ని అందించడానికి మరిన్ని మెరుగైన ప్రయత్నాలు చేపట్టాలి. ధర్మాచరణ పట్ల యువతకు ఆసక్తిని పెంపొదించాలి. సంస్కృత భాషను ప్రోత్సహించాలి. దీనివల్ల భాషతో పాటు సంస్కారం కూడా యువతకు అలవడుతుంది.

శ్రీ కమలానంద భారతీ స్వామి, భువనేశ్వరి పీఠం, గన్నవరం, విజయవాడ

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం టీటీడీ. హిందూ ధర్మ ప్రచారానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ హిందూ ధర్మప్రచార పరిషత్ ను ఏర్పాటు చేసింది. ఈ పరిషత్ ద్వారా  హిందూ మత వ్యాప్తి కోసం ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి.

శ్రీ సౌందరరాజన్ రంగరాజన్, చిలుకూరు బాలాజీ ఆలయం, హైదరాబాద్

ధర్మాన్ని రక్షించి భావితరాలకు అందించటానికి సదస్సు ఏర్పాటు చేశారు. ఉన్న ఆలయాల్లో ధర్మరక్షణ కోసం అర్చకుల్ని భాగస్వాములను చేయాలి. అట్టడుగు వర్గాల వారికి సరైన వివరణ ఇవ్వాల్సి ఉంది. ఒంటిమిట్ట రామాలయంలో మాల హరిదాసు స్థల పురాణం ఉంది. అక్కడ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అట్టడుగువర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్టుల ద్వారా నామసంకీర్తన, భజన కార్యక్రమాలు విస్తృతం చేయాలి. పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. బుర్రకథలు, ఒగ్గు కథలను ప్రోత్సహించాలి. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఉత్తాల పండుగలో టీటీడీ చొరవ తీసుకుని భాగస్వామ్యం కావాలి.

శ్రీ విద్యావల్లభతీర్థ స్వామి, కన్నూర్ మఠం, ఉడుపి

భారతదేశంలో ఉన్న సాధు సంతులను టీటీడీ ఒక చోట చేర్చి ఇలాంటి మహత్ కార్యాన్ని చేపట్టింది. మన సనాతన సంప్రదాయాన్ని నిలిపేందుకు మరిన్ని కార్యక్రమాలు చేయాలి. పిల్లల్లో నైతికత పెంచే కార్యక్రమాలు సంతోషకరం. గుడికో గోమాత కార్యక్రమం విజయవంతం కావడం ఆనందం. దాస సాహిత్యం ఉన్నత స్థాయిలో ప్రచారం కావడానికి టీటీడీ కృషి విశేషం. వేద అధ్యయనం చేస్తున్న విద్యార్థులకు మరింతగా ఆర్థిక సహాయం చేయాలి. 

శ్రీ రేవతి రమణదాస్, అంతర్జాతీయ ఉపాధ్యక్షులు, ఇస్కాన్

టీటీడీ ద్వారా దేశవ్యాప్తంగా గోశాలలు ఏర్పాటు చేయించడానికి కృషి చేయాలి. తిరుమల తరహాలో తిరుపతి ఇతర ప్రాంతాల్లో గోవింద నామస్మరణ జరగాలి.

శ్రీ విద్యా విజయతీర్థ స్వామి, బెంగళూరు

దాస సాహిత్యం ప్రచారం బాగా జరుగుతోంది. టీటీడీ 27 ప్రాజెక్టుల ద్వారా అనేక హిందూ ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ధార్మిక, సాంస్కృతిక, విద్య, వైద్య సేవాకార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఇప్పటి పరిస్థితుల్లో లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి వైద్యం అందిస్తున్న టీటీడీకి ప్రత్యేక కృతజ్ఞతలు. సాహిత్యం, శిల్పకళా శాస్త్రం, సంగీత శాస్త్రం అన్నింటిలో ప్రత్యేక కృషి చేస్తోంది. టీటీడీ వేదపరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.

సప్తగిరి మాసపత్రికను పలు భాషల్లో ప్రచురిస్తున్నారు. ఇలాంటి పలు కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుతున్నాం.

శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ, పెద్ద పులిపాక ఆశ్రమం, కృష్ణా జిల్లా

గోసంరక్షణ కోసం టీటీడీ చర్యలు తీసుకోవాలి. మాతృమూర్తులు, స్త్రీలను గౌరవించడం, వారిని కూడా ధార్మిక కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయాలి. టీటీడీ పాలక మండలిలో ధర్మాచార్యులకు కూడా అవకాశం ఇస్తే సలహాలు, సూచనలకు అవకాశం ఉంటుంది.

శ్రీ నారాయణజీ మహారాజ్, ద్వారక, శంకరాచార్య మఠం, గుజరాత్

హిందూ సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, రక్షించడానికి పలు పీఠాలకు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులందరూ ఏకం కావాలి. ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంలో టీటీడీ ముందు వరుసలో ఉంది.