ఫిబ్రవరి నెలలో తిరుమలతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఇతర ఆలయాల్లోనూ విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు.
రథసప్తమి పర్వదినం
ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఒకేరోజు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
వాహనసేవలను వీక్షించేందుకు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ధార్మిక సదస్సు
- హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు, మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నారు.
- దేశం నలుమూలల నుండి 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు విచ్చేయనున్నారు.
- పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించాలనే సంకల్పంతో ఈ ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నారు.
తిరుమలలో విశేష ఉత్సవాలు
- తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 8 నుండి 10వ తేదీ వరకు శ్రీపురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
- ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న తిరుమల కల్యాణ వేదికలో యువ కళాకారులతో ‘‘శ్రీ వేంకటేశ్వర నవరత్నమాలిక’’ సంగీత కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
- ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 24న కుమారధార తీర్థ ముక్కోటి.
నకిలీ వెబ్‌సైట్లతో మోసపోకండి
- శ్రీవారి భక్తులు నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ ఐటి విభాగం క్షుణ్ణంగా పరిశీలించి 52 నకిలీ వెబ్‌సైట్లను, 13 నకిలీ మొబైల్ యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.
- టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in లో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను కోరుతోంది.
టీటీడీ ఆధీనంలోని ఇతర ఆలయాల్లో…
- ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకు దేవుని కడపశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు.
- ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారు, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారు, నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
- ఫిబ్రవరి 17 నుండి 23వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు.
- శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు వైభవంగా జరుగుతాయి.
- తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు వైభవంగా నిర్వహింపబడతాయి.
జనవరి నెలలో తిరుమలలో నమోదైన వివరాలు
దర్శనం
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 21.09 లక్షలు.
హుండీ ఆదాయం
హుండీ కానుకలు: రూ.116.46 కోట్లు.