స్వామి వివేకానంద: భారతదేశ అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకులు, దేశ భక్తులు, మాటలతో మంత్రముగ్దులను చెయ్యగలిగే గొప్ప వక్త, బ్రతికింది కేవలం 39 సంవత్సరాలే కానీ మరొక 1000 సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేసినమహనీయులు స్వామి వివేకానంద. కుల, మత, జాతి, లింగ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శం ఆయన.
జన్మ విశేషాలు
స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12 తేదీన మకర సంక్రాతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రిగారు న్యాయవాదిగా పనిచేసేవారు. స్వామి వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్ర నాధ్ దత్తా.
1871 లో తన ఎనిమిదవ ఏట నరేంద్రుడు ఈశ్వర చంద్ర విద్యా సాగర్ మెట్రో పాలిటన్ పాఠశాలలో చేరారు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వ శాస్త్ర గ్రంధాలు , నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంధాలు, ఇలా ఎన్నో చదివేశారు.
రామకృష్ణ పరమహంస దర్శనం
స్వామి వివేకానంద యువకునిగా ఉన్నప్పటి నుండి కూడా భగవంతుడు అనే వాడు ఒకడు ఉంటే ఎలాగైనా ఆయన్ని ఖచ్చితంగా చూడాలని నిర్ణయించుకున్నాడు. ఎవరైనా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కనిపిస్తే మీరు భగవంతుడిని చూసారా ? అని అడిగేవాడు. దేవుణ్ణి చూశామని సమాధానం ఇచ్చిన వారు ఎవరూ లేరు. ఒకరోజు స్కోటిష్ కాలేజ్ ప్రిన్సిపాల్ విలియం హేస్టీ పాఠం చెప్తూ "పారవశ్యం" అనే పదాన్ని వివరించాలనుకుంటాడు. కానీ అది ఆయనకు సాధ్యం కాదు. అప్పుడు ఆయన ఈ పదానికి అర్ధం తెలియాలంటే దక్షిణేశ్వర్ లో ఉండే శ్రీరామకృష్ణ పరమహంస గురించి చెప్పి ఆయనను కలవమని చెప్పారు. అలా ఆ పదానికి అర్ధం తెలుసుకోవడానికి నరేంద్రుడు దక్షిణేశ్వర్ కి వెళ్ళాడు. ఇక్కడినుంచే ఆయన జీవితం గొప్ప మలుపు తిరిగింది.
అక్కడ రామకృష్ణ పరమహంస ను కూడా మీరు దేవుణ్ణి కళ్లారా చూసారా? అని అడుగుతాడు.అప్పుడు పరమహంస అవును చూసాను.!నిన్ను ఎలా చూస్తున్నానో నీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే భగవంతుని కూడా చూశానని భగవంతుమితో మాట్లాడానని ఆయన అన్నారు. మొట్టమొదటిసారి ఒక వ్యక్తి దేవుడిని చూసాను అని చెప్పేసరికి నరేంద్రుడు ఆశర్య పోయాడు.
అప్పుడు నరేంద్రుడు అయితే నాకు కూడా దేవునికి చూపించండి అంటాడు. అప్పుడు రామకృష్ణులు ఆయన కాలును మెల్లగా నరేంద్రుడి ఒడిలో ఉంచారు.మరుక్షణం నరేంద్రుడికి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆయనకేదో అయిపోతున్నట్లుగా అనిపించసాగింది. నన్నేమి చేస్తున్నారు ? నా తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నారు. నేను మళ్ళీ వారి దగ్గరకు వెళ్ళాలి. అని అరిచాడు. అప్పుడు రామకృష్ణుల వారు చిరునవ్వు నవ్వుతూ ఈరోజుకిది చాలు అని చెప్పి తన కాలును వెనక్కి తీసేసుకున్నారు. ఇలా రామకృష్ణుల సన్నిధిలో ఎన్నో అద్భుతాలను నరేంద్రుడు చూసాడు.
దానితో నరేంద్రుడు రామకృష్ణ పరమహంసకు శిష్యునిగా చేరాడు. ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. అలా చదువుకుంటూనే మెల్లగా సన్యాస మార్గంలోకి నడిచాడు.
ఈ లోపు తండ్రి మరణంతో కుటుంబం పేదరికంలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. తల్లికి, చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకు తిండి పెట్టడంకోసం ఉద్యోగం కోసం వెతుకుంటూ ఉండేవాడు. కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడు. ఇంటికి వచ్చిన తరువాత తాను స్నేహితుల ఇంట్లో తిన్నానని అబద్దం చెప్పి తన కోసం ఉంచిన ఆహారాన్ని చెల్లెలకు ఇచ్చేసేవాడు. ఉద్యోగం కోసం తిరుగుతూ ఆకలితో ఎన్నో సార్లు కళ్ళు తిరిగి రోడ్ల మీద పడిపోయేవాడు. చివరికి ఒక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి దొరుకుతుంది.
రామకృష్ణుల మరణం
రామకృష్ణ పరమహంస కు గొంతు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యం క్షీణించింది. దాంతో నరేంద్రుడు ఉద్యోగం మానేసి గురువు గారికి సేవ చెయ్యనికి వెళ్ళిపోయాడు. కానీ 1886 లో రామకృష్ణ పరమహంస మరణించారు. రామకృష్ణులవారు చనిపోయిన తరువాత ఆయన శిష్యులందరూ కలిసి ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుని అందులో ఉండేవారు. వాళ్ళకి నరేంద్రుడు నాయకుడిగా ఉండేవారు.
చికాగో పయనం
పాశాత్య దేశాలకు వెళ్లి భారతదేశపు గొప్పతన్నాని చాటాలని అలాగే తిరిగి వచ్చిన తరువాత నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయులను మేల్కొలపాలని వివేకానంద స్వామి నిర్ణయించుకున్నారు.
అయితే చికాగో లో జరగబోయే సర్వమత మహా సభలకు వెళ్లాలని, అక్కడ భారతదేశ గొప్పతనాన్ని, ఆధ్యాత్మికను చాటి చెప్పాలనుకున్నారు. అయితే విదేశాలకు వెళ్ళడానికి కావలసిన డబ్బును కొంతమంది మహారాజులు సమకూర్చారు. దేశ నలుమూల నుండి ఎంతో మంది విరాళాలు పంపారు. అలా 1893 వ సంవత్సరం మే 31వ తేదీన బొంబాయి తీరం నుండి ఒక నౌక లో ఆయన బయలుదేరారు. జులై నెలలో ఆయన చికాగో చేరుకున్నారు. అయితే అక్కడకి వెళ్ళాక తెలిసింది సర్వ మత మహా సభలు మూడు నెలలు వాయిదా పడ్డాయని.
స్వామిజికి చికాగోలో ఎవరూ తెలియదు. అలా వీధులలో తిరుగుతూ ఉండేవారు ఆయన వేషధారణను అందరూ వింతగా చూసేవారు . కొంతమంది అపహాస్యం చేసేవారు. అలా ఒకసారి స్వామి జీచికాగో లో నడుస్తున్న సమయంలో ఒకామె వాళ్ళ భర్తతో "చూడండి. ఆయన బట్టలు ఎలా ఉన్నాయో.! అసలు జెంటిల్ మ్యాన్ లా లేడు" అంటూ స్వామిజి ని అపహాస్యం చేస్తుంది . అప్పడు స్వామిజి "చుడండి మేడం.! మీ దేశంలో ఒక మనిషిని టైలర్ జెంటిల్ మ్యాన్ గా మార్చుతారేమో,కానీ మా దేశంలో క్యారక్టర్ జెంటిల్ మ్యాన్ గా మారుస్తుంది. అని సమాధానమిచ్చారు.
అక్కడ చికాగోలో ఎన్నో కష్టాలు పడ్డారు. అన్ని రోజుల పాటు ఉండాలంటే చికాగో ఖరీదైన నగరం . ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఆయనకు కేథరిన్ అనే ఒక మహిళ పరిచయమయ్యింది. ఆమె స్వామిజితో మాట్లాడిన కొంత సేపటికే ఆయన గొప్పతనం తెలుసుకుని బోస్టన్ నగరంలో ఉండే తన ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండమని కోరింది. దానికి స్వామిజీ ఒప్పుకుని ఆ ఇంట్లో ఉండేవారు.
ఆ సమయంలో స్వామిజీకి జి.హెచ్.రైట్ అనే ఒక ప్రొఫసర్ తో పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు స్వామిజి ఆ ప్రొఫషర్ ని విశ్వమత మహా సభల్లో మాట్లాడానికి తనకి అనుమతి ఇప్పంచిమని అడుగుతారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ విశ్వమత సభలను నిర్వహించే వాళ్లకు ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో ఇలా రాస్తారు. ఈ అమెరికాలోని పండితులను మేధావులను, అందరినీ ఒక వైపు కూర్చోపెట్టి ఈ వివేకానందను ఒకవైపు కుర్చోపెట్టినా కూడా ఈ స్వామిజి మేధస్సుకు, స్థాయికి వాళ్ళు సరిపోరని ఆయన ఆ ఉత్తరంలో పేర్కొంటారు.
వివేకానంద ప్రసంగం ప్రపంచాన్ని మేల్కొలిపింది
సర్వ మత మహా సభలు 1893 సంవత్సరం సెప్టెంబర్ 11 న తేదీన ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన గొప్ప గొప్ప వాళ్ళందరూ.. సూటు బూట్లతో రెడీ అయ్యి ఉంటారు. కానీ వివేకానంద దుస్తులు, వేషధారణ చూసి ఆయన్ని ఎవరూ కూడా గౌరవించలేదు. చులకనగా చూసారు. సభలో ఒక్కొక్కరుగా లేచి వాళ్ళ మతాల గొప్పతనం గురించి మాట్లాడుతుంటారు. చివరగా స్వామి వివేకానంద వంతు రానే వచ్చింది. స్వామిజీ నిల్చుని గంభీరమైన గొంతుతో " సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’’ ‘‘అమెరికా దేశపు సోదర సోదరీ మణులారా" అని పలకరించే సరికి ఆ ఒక్క పిలుపుకి సభలో ఉన్న 4000 మందికి పైగా జనం లేచి 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొట్టారట.
అప్పటి వరకు అందరు "లేడీస్ అండ్ జెంటిల్ మెన్" అంటూ స్పీచ్ మొదలు పెట్టారు కానీ వివేకానంద సోదర సోదరీమణులారా అని పలకరించేసరికి ఆ పిలుపులో ఆత్మీయత వాళ్ళ హృదయాలను తాకింది. ఏ స్వార్థం లేని పిలుపుకి కొంతమంది కన్నీరు కూడా కార్చారు. ఆ చప్పట్ల శబ్దం ఆగిన తరువాత ఆయన భారతదేశ గొప్పతనం గురించి మన దేశంలో ఆధ్యాత్మికత, సనాతన దర్మం, సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రసంగించారు. దానితో సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. సభలో ఉన్న మేధావులు, గొప్ప గొప్ప వాళ్లంతా తమ స్థాయిని కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఎగబడుతూ స్టేజి వద్దకు వచ్చి స్వామీజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
తరువాత రోజు చికాగో లో వార్త పత్రికల్లాంటిలోను ఫ్రంట్ పేజీలో స్వామిజి ఫోటో లే, ఆయన ప్రసంగాన్నే ప్రముఖంగా ప్రచురించాయి. అన్ని న్యూస్ పేపర్ లు కూడా ఆయనని ‘‘సైక్లానిక్ మాంక్ ఫ్రం ఇండియా’’ అని పేర్కొన్నాయి. ఒక చికాగో పత్రిక అయితే "ఇటువంటి మనిషి యుగానికి ఒకరే పుడతారు.ఆయనను సజీవంగా చూస్తూ ఆయన బోధనలను వినడం నిజంగా మనం చేసుకున్న పుణ్యం" అని వ్యాఖ్యానించింది.
ఇలా కేవలం చికాగోలోనే కాదు ప్రపంచంతా ఈ భారతీయ సన్యాసి గురించి మారు మోగిపోయింది. అక్కడ ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. కొంతమంది ఆయనకి శిష్యులుగా మారిపోయారు కూడా.
వివేకానంద తన ప్రసంగంతో భారతదేశపు స్థాయిని పెంచారు
వివేకానంద స్వామి తన సమ్మోహన ప్రసంగంతో అప్పటి వరకు భారత దేశం అంటే, మూఢ నమ్మకాలతో, చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్లందరికీ భారత దేశం పట్ల ఉన్న అపోహలను తొలగించారు. గౌరవం కలిగేలా చేసారు. భారత దేశపు స్థాయిని పెంచారు. ఈ విశ్వ మత సభలు కొన్ని రోజుల పాటు జరిగాయి. ప్రతి రోజు కూడా స్వామి వివేకానంద ప్రసంగాన్ని చివర్లో ఉంచేవారు. ఎందుకంటే సభలో జనమంతా కూడా చివర్లో ఉండే వివేకానంద స్పీచ్ కోసం ఆ సభ చివరి వరకు ఉండేవారట. అదే స్వామిజి స్పీచ్ ముందే పెడితే ఆయన స్పీచ్ అయిన వెంటనే లేచి వెళ్ళిపోయేవారు.
ఒక్కరోజులోనే చికాగో నగరమంతా స్వామిజి కీర్తితో నిండిపోయింది. ఇతనిని ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదమని కొంతమంది ఈయన మీద దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఈయనను చంపడానికి కూడా ప్రయత్నించారు. అలాగే ఒకసారి స్వామిజి ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో ఈయన అంటే పడని ఒక వ్యక్తి ఒక పేపర్ మీద "ఇడియట్" అని రాసి స్వామిజి మీదకు విసిరాడు. అప్పుడు స్వామిజి అది తెరిచి చదివి ఇలా అన్నారు . "పాపం ఎవరో వాళ్ళ పేరు రాసారు కానీ మేటర్ రాయడం మర్చిపోయారు అని" అలా ఉండేది. ఆయన సమయస్ఫూర్తి.
వివేకానంద మరణం
స్వామి వివేకానంద అకాల మరణం ఆయన ఆరోగ్యం క్షీణించడం వల్లనే జరిగింది. అతను కొంతకాలంగా ఆస్తమా మరియు డయాబెటిస్‌తో సహా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ ఆరోగ్య సమస్యలు చివరికి అతని శరీరాన్ని దెబ్బతీశాయి.
స్వామి వివేకానంద మరణం 39 సంవత్సరాల వయస్సులో ఆరోగ్య సమస్యల కారణంగా జూలై 4, 1902న సంభవించింది. అతని వర్ధంతి ఆధ్యాత్మికత మరియు తత్వశాస్త్రానికి ఆయన చేసిన గణనీయమైన కృషిని స్మరించుకునే రోజు. ఆయన బోధనలు నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూ, మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి.