అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకుని తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో సోమవారం సంపూర్ణ వాల్మీకిరామాయణ పారాయణం ఘనంగా జరిగింది. ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సీతాలక్ష్మణ సమేత రాములవారికి, హనుమంతుల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాంద, సుందరకాండ, యుద్ధకాండలు కలిపి 20 వేలకు పైగా శ్లోకాలను పారాయణం చేశారు. అదేవిధంగా యాగశాలలో వేద విద్యార్థులతో ఏడు వేదశాఖల సంపూర్ణ మూలపారాయణం చేపట్టారు. వీటితోపాటు ఆనందనిలయంలో ప్రబంధ, ఆగమ విద్యార్థులతో శ్రీ సీతారామ మంత్రానుష్టానం, కార్యాలయంలోని హాలులో స్మార్త విద్యార్థులతో శ్రీ లక్ష్మణ, హనుమ మంత్రానుష్టానం చేశారు.