తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం మహాసంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో మే 21 నుండి 25వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి.
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాశాంతి తిరుమంజనం
మహాసంప్రోక్షణలో భాగంగా ఈ నెల 24, బుధవారం రోజున శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధన, పంచగవ్యారాధన నిర్వహించారు. ఉదయం జలవాసం, బింబస్థాపన చేపట్టారు.
సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన రాగి రేకులు అమర్చేందుకు 2021 సెప్టెంబరు 14న పనులు ప్రారంభించారు. విమాన గోపురం పనులు పూర్తి కావడంతో జీర్ణోద్ధరణ, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
గురువారం ఉదయం 4 నుండి 7.30 గంటల వరకు కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి, ఉదయం 7.45 నుండి 9.15 గంటల వరకు మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆ తరువాత అక్షతారోహణం, అర్చక బహుమానం అందించారు. ఉదయం 11.30 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనం కల్పించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు పెద్ద శేష వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు.
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.
రాత్రి 7.30 గంటల నుండి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.