అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా మే 20 శనివారం రోజున ఆగమోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు.
రంపచోడవరంలో శాస్త్రోక్తంగా విగ్రహస్థాపన
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ విగ్రహస్థాపన మే 21 ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ సందర్భంగా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు బింబశుద్ధి కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలను మంత్రపూరితమైన పవిత్ర జలంతో అభిషేకం చేశారు. అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, రత్నన్యాసం, ధాతున్యాసం, ఆలయానికి, రాజగోపురానికి విమానకలశస్థాపన, విగ్రహస్థాపన చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు మహా శాంతి, పూర్ణాహుతి, చతుర్దశ కలశస్నపనం, నవకలశస్నపనం, మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు.
రాత్రి 8 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు, రక్షాబంధనం, శయనాధివాసం, విశేష హోమాలు నిర్వహించారు.
రంపచోడవరంలో ఆగమోక్తంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ మహాసంప్రోక్షణ
రంపచోడవరంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ మే 22 సోమవారం ఆగమోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 5 నుండి 8.15 గంటల వరకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8:15 నుండి 8:45 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి జరిగింది. ఉదయం 8:45 నుండి 9 గంటల వరకు యాత్ర దానము, కుంభ ప్రదక్షిణ చేశారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన చేపట్టారు.
ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు.
భక్తులకు దర్శనం ప్రారంభం
మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. రంపచోడవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. విచ్చేసిన భక్తులందరికీ, తాగునీరు, మజ్జిగ ,అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.
శ్రీవారి సేవకుల విశేష సేవలు
రంపచోడవరం ఆలయ మహాసంప్రోక్షణ సందర్భంగా ఆరు రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాల్లో శ్రీవారి సేవకులు విశేష సేవలు అందించారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, ఆలయానికి అవసరమైన పూలు కట్టడం లాంటి సేవలు అందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల నుంచి దాదాపు 500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు.
రంపచోడవరం శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీవారి కల్యాణం
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 22 సోమవారం రాత్రి శ్రీవారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది.
ముందుగా వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన రంపచోడవరం పరిసర ప్రాంతాల భక్తులు భక్తిపారవశ్యంతో పులకించారు.