జగత్తు, దేవుడు, జీవుడు అనే పరంపర నుంచి మూడు వాదాలు ఉద్భవించాయి. అవే మూడు ప్రధాన మతసిద్ధాంతాలుగా ఆవిర్భవించి, విస్తృతంగా వ్యాప్తిచెందాయి. ఆ సిద్ధాంతాలే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. అయితే... హైందవ ధర్మానికి మూలస్తంభాలుగా పేర్కొనదగ్గ ముగ్గురు ఆచార్యులు ఈ మూడు మత పరంపరలకు ఆద్యులు. వారే జగద్గురు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, వల్లభాచార్యులు లేదా మధ్వా చార్యులు. కాలక్రమంలో మూడు మతాలు మతత్రయంగా, ఈ ముగ్గురూ ఆచార్యత్రయంగా ప్రసిద్ధి చెందారు.
అద్వైత సిద్ధాంతము అంటే...
జగద్గురు శ్రీఆదిశంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఈ సిద్ధాంతానికి ఆయనే రూపకర్త కూడా. అద్వైతం అంటే రెండు కానిది... అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతోబాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. ప్రయాణ సదుపాయాలు లేని ఆ రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఏక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు. బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందు తుండటం విశేషం.
శ్రీఆదిశంకరాచార్యుల సిద్ధాంతం ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’... అంటే నేనే బ్రహ్మను అని తెలుసుకునేవాడు జీవన్ముక్తుడు అవుతాడు.
శంకరులవారి జీవిత విశేషాలు
సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ,శివగురులకు కేరళ లోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్‌కు కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుని పొందినారని, పార్వతీ దేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరునికి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. అయితే ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి నేటికీ కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారని చెబుతుండగా, కంచి మఠం ప్రకారం శంకరులవారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో జన్మించారని చెబుతున్నారు.
శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరుడు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకథారా స్తోత్రాన్ని చెప్పారు. కనకథారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసిందని చెబుతారు.
పిన్న వయసులోనే సన్యాసం స్వీకరించిన శంకరులు గురువు కోసం అన్వేషిస్తూ కాలడి విడిచి, నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. అక్కడ శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులకు బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు.
శంకరులవారికి పరమశివుడు తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా నిర్దేశించాడని చెబుతారు ‘’వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వానిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి.’’ ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
ఉపనిషత్తులకు భాష్యాలు
అలా శివుని అనుగ్రహంతో తన పన్నెండేళ్ళ వయస్సులో వారణాసిలో ఉన్నప్పుడు ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రాశారు. వీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము మరియు’’లలితా త్రిశతి’’లకు కూడా భాష్యాలు వ్రాశారు. ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాల అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు.
ఆత్మప్రబోధకాలు భజగోవింద శ్లోకాలు
మధుర భక్తి సాహిత్యంలో జగద్గురు ఆదిశంక రాచార్యులు రచించిన భజగోవింద శ్లోకాలకు ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి. భజగోవింద శ్లోకాలు అపూర్వ వేదాంత సూత్ర మాలికలు. మనకు ఆత్మానందాన్ని కలిగించే శక్తి భజగోవింద శ్లోకాలకు ఉంది. ఇవి ఆత్మజ్ఞాన ప్రబోధకాలు, వైరాగ్య ప్రతి పాదకాలు, భగవంతునికి దగ్గరగా చేర్చే మార్గ నిర్దేశనం చేసే భక్తి భావనా ప్రేరకాలు. ఈ భజగోవింద శ్లోకాలకే మోహ ముద్గరం అని మరో పేరు ఉంది. ప్రతి రోజూ ఉదయం వేళల్లో భజగోవింద శ్లోకాలు చదివితే మనలో మానసిక పరమైన ఒత్తిడులను, బాధలను, కష్టాలను దూరం చేస్తాయి. ఈ భజగోవింద శ్లోకాలకు అంతటి శక్తి ఉంది. భజగోవింద శ్లోకాలు నిష్టతో చదివితే మనలో చెప్పలేని మార్పులు కలుగుతాయి. ముఖ్యంగా జీవితం అంటే ఏమిటో తెలుసుకోగలం. జీవితం యొక్క పరమార్థం తెలుస్తుంది. జీవితపు విలువలు తెలుస్తాయి. మనలో కలిగే అశాంతిని దూరం చేసి శాంతిని కలిగించే దివ్యశక్తి భజగోవింద శ్లోకాలకు ఉంది. ఆదిశంకరాచార్య మాధుర్యగళం నుండి ఆశువుగా భజగోవింద శ్లోకాలు జాలువారాయి. ఈ శ్లోకాలలో జీవిత సత్యాలు గోచరిస్తాయి. కేవలం పండితులే కాదు కోట్లాది మంది పామరులు ఈ భజగోవింద కృతిలోని శ్లోకాలను లోతుగా అర్థం చేసుకొని, తమ జీవితాలను పునీతం చేసుకున్నారు. జీవిత సాఫల్యానికి అవసరమైన వేదాంత సూత్రాలను భజగోవింద శ్లోకాలు పదే పదే మనకు ప్రబోధిస్తాయి. భజగోవిందంలోని ప్రతి శ్లోకం గురూపదేశాలుగా మనకు స్ఫురింప చేస్తాయి. ప్రతి శ్లోకం కూడా మన హృదయానికి హత్తుకు పోతుంది... జీవిత సత్యాలు ప్రతి శ్లోకంలో మనకు కనిపిస్తాయి.
ఈ శ్లోకాలలో మానవ జీవిత ప్రతిబింబం గోచరి స్తుంది. ఈ జగత్ మిధ్య అని, బ్రహ్మ సత్యమని ఆది శంకరా చార్యులు చెప్పారు. ఈ ప్రపంచం నేడు ఉన్నా, భవిష్యత్‌లో లేకుండా పోవచ్చు. మనకళ్లముందే కొన్ని దేశాలు భూకంపాలతో నేలమట్టం అవుతూ, పెద్ద పెద్ద నగరాలే భూస్థాపితం అవుతున్నాయి. ఈప్రపంచం శాశ్వతం అనుకోవడం తెలివి తక్కువ తనమే అవుతుంది. మన కంటికి కనిపించేదంతా మిధ్య, మాయ. దాన్నే సత్యంగా, నిత్యంగా నమ్ముకొని మనమంతా మోసపోతున్నాం. బాహ్యమైన (కనిపించే) పంచేంద్రియాలు మనకిచ్చేది మిధ్యా జ్ఞానం. అంతకు మించిన అలౌకిక జ్ఞానం వేరే ఉంది. దానిని జ్ఞానేంద్రియాలు సమకూరుస్తాయి. కర్మేంద్రియాలను నమ్ముకొని మూఢుడవు కావద్దని శ్లోకాల ద్వారా జగత్‌గురువులు శ్రీఆదిశంకరాచార్యులు వివరించారు. ఈ ప్రపంచంలో నాస్తికవాదాన్ని తొలగించి, వైదిక ధర్మాన్ని పునరుద్ధరించడానికి శంకరుల వారు నడుం కట్టారు. భజగోవింద శ్లోకాల్లో ఆదిశంకరులు 16 శ్లోకాలు చెప్పారు. మిగిలిన 15 శ్లోకాలను శంకరాచార్యుల శిష్యులు రాశారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ 31 శ్లోకాలతో మోహ ముద్గరం పేరుతో భజగోవింద కృతి ఏర్పడింది. ఈ భజగోవింద శ్లోకాలను ప్రతి ఒక్కరూ చదివి ఆశ్లోకాలను లోతుగా అర్థంచేసుకోవాలి. ఈ శ్లోకాలను చదివి తమ జీవితాలను ఉత్తమ మార్గంలో నడిపిస్తే చాలు ఈ లోకంలో శోకం దూరమై శాంతికి, ఆనందానికి అతి దగ్గరవుతాము.