బౌద్ధ భిక్షువులందరికీ వైశాఖ పూర్ణిమ ముఖ్యమైన పర్వదినం. బుద్ధుని జీవితంలో వైశాఖ పూర్ణిమకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. వైశాఖ పూర్ణిమనాడు పుట్టాడు, వైశాఖ పూర్ణిమ నాడే బుద్ధుడిగా మారాడు, అదే వైశాఖ పూర్ణిమనాడే నిర్యాణం చెందాడు. ఇలా వైశాఖ పూర్ణిమ బుద్ధుని జీవితంతో పెనవేసుకొని ఉంది.
గౌతమబుద్ధుడు జన్మ వృత్తాంతం
సుమారు 2,500 సంవత్సరాలకు పూర్వం నేడు నేపాల్‌గా పిలుస్తున్న హిమాలయ పర్వత సానువులకు దగ్గర శాక్యులనే తెగవారు నివసించేవారు. వారి రాజధాని కపిలవస్తు నగరం. కపిలవస్తు రాణి మాయాదేవి గర్భం ధరించింది. ఆమెకు పుట్టింటికి పోవాలన్న కోరిక కలిగి ఆ విషయాన్ని రాజుకు వెల్లడించింది. రాజు పల్లకి బోయిలను రప్పించి రాణి పుట్టింటికి వెళ్లడానికి సన్నాహాలు చేశాడు. ఆమె పుట్టిల్లు తోడిశాక్య ప్రజాసత్తాక రాజ్యమైన దేవదహనగరం.
కపిలవస్తు నుండి దేవదహకు పోయేదారిలోనే లుంబిని వనం ఉంది. ఇది అడవిమార్గంలో ఉంటుంది. అక్కడ సాలవృక్షాలు ప్రసిద్ధి చెందినవి. పల్లకి ఆ మార్గంలోకి వచ్చేసరికి రాణికి నొప్పులు వచ్చాయి. పల్లకీ ఆపమని చెప్పింది. ఆమెకు తోడుగా ఆమె సోదరి ఉంది. పురుషులెవరో వస్తున్నారని గ్రహించిన సోదరి రాణికి పురుడుపోయడానికి వీలుగా ప్రదేశాన్ని చదునుచేసి ఆకులు పరచమని బోయిలను సూచించింది. అక్కడే మగ శిశువును ప్రసవించింది. అతనే గౌతముడు.
పెరిగి పెద్దవాడవుతూ చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తున్న కొద్దీ గౌతమునికి తీవ్రమైన మసస్తాపం కలిగింది. దీంతో భార్యను, బిడ్డలను వదిలి దుఃఖాన్ని తొలగించుకోడానికి పరితపిస్తూ ఉన్న గౌతముడు వైశాఖ పూర్ణిమ రోజున బీహార్‌లోని గయ చెంతగల మర్రివృక్షం కిందకు చేరాడు. వెంటనే దివ్యకాంతి ఆవహించి మనస్సు స్థిరమైపోయింది. ఆరోజు నుంచి గౌతముడు గౌతమ బుద్ధునిగా మారాడు. తనకు కలిగిన ఈ పరివర్తనను గ్రహించిన బుద్ధుడు తనకు కలిగిన అనుభవాలను బోధిస్తూ ఊరూరా తిరుగుతూ బౌద్ధమత ప్రచారాన్ని ప్రారంభించాడు. మానవుడు మానవుడిగా ఉండాలంటే ఏం చేయాలో పంచశీల సూత్రాల ద్వారా ప్రబోధించాడు.
బోధివృక్షానికి పూజ
బుద్ధ పూర్ణిమనాడు బోధివృక్షానికి పూజచేసే ఆచారం బౌద్ధులలో ప్రారంభమైంది. ఇది కూడా బుద్ధుని కాలంలోనే ప్రారంభం కావడం విశేషం. స్వామి వనంలో ఉండగా ఒకనాడు భక్తులు స్వామికి పూజచేయడం కోసం పూలు తెచ్చారు. ఎంతసేపు నిరీక్షించినా స్వామి కనిపించలేదు. భక్తులు నిరుత్సాహపడి అక్కడే ఆ పూలను వదిలేసి వెళ్లారు. దీన్ని గమనించిన అనంత పిండుడు అనే భక్తుడు స్వామి రావడంతోనే ఈవిషయాన్ని వెల్లడించాడు. స్వామి తన శరీరానికి పూజను నిరాకరించి తనకు జ్ఞానోపదేశం చేసిన బోధివృక్షాన్నే పూజించాలని చెప్పారు. తాను నిర్యాణం చెందాక కూడా తన పార్థివ శరీరానికి కాకుండా వృక్షానికే పూజలు చేయాలని శాసించారు.
స్వామి ఆంతర్యాన్ని గ్రహించిన ఆనందుడు గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి జేతవన విహారంలో నాటాడు. ఆనాడు ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహించారు. కోసలదేశపు రాజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్ధులలో ముఖ్యభాగమైంది. ఈ పూజను ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు చేయడం ఆచారమైంది. బౌద్ధమతం ఆచరిస్తున్న అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధివృక్షానికి పూజలు చేస్తారు. ఆనాడు బౌద్ధులు బోధివృక్షానికి జెండాలు కట్టి దీపాలు పెట్టి పరిమళ జలాన్ని చల్లుతారు.
హీనయాన బౌద్ధమతాన్ని అనుసరించే బర్మాలో ఈ ఉత్సవం చూడటానికి చాలా బాగుంటుంది. ప్రతి స్త్రీ పరిమళ జలభాండారాన్ని తలపై పెట్టుకొని మేళతాళాలతో బయలుదేరుతారు. వెనకనుంచి పిల్లలు, పెద్దలు దీపాలు, జెండాలు పట్టుకొని వస్తారు. బస్తీ నాలుగు మూలలనుంచి బయలుదేరిన వారంతా సాయంకాలానికి బౌద్ధాలయానికి చేరుతారు. లోపల దేవాలయంలోని బోధివృక్షానికి మూడుసార్లు ప్రదక్షణ చేసి కుండల్లో తెచ్చిన నీటిని చెట్టు మొదట్లో పోసి దీపాలను వెలిగిస్తారు. చెట్టుకి జెండాలు కట్టి నమస్కరిస్తారు. ఇక్కడితో పూజ ముగిస్తుంది.