డొల్లు కర్తరీ అంటే ఏమిటి? కర్తరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 3 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మధ్య కాలాన్ని “కర్తరీ” అంటారు. అంటే భరణి నాలుగో పాదం ,కృత్తిక నాలుగు పాదాలు,రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు. దీనినే సామాన్య భాషలో “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు.

సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే “డొల్లు కర్తరీ”ప్రారంభమవుతుంది.దీనినే “చిన్న కర్తరీ” అని కూడా అంటారు.సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై “నిజకర్తరి” ప్రారంభమవుతుంది. సూర్యుడు రోహిణి నక్షత్రం రెండవ పాదం ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.

కర్తరీ లో ఈ పనులు చేయకూడదు

కర్తరీ లో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. కర్తరిలో గృహ సంబంధమయిన పనులు చేయద్దన్నారు. నాటిరోజులలో వేసవిలో గృహ సంబంధమయిన పనులు తప్పించి మరొక పని వుండేడి కాదు. వేసవి నుంచి, వడగాడ్పుల నుంచి రక్షణకే కర్తరిలో కొన్ని పనులు వద్దన్నారు. నిజానికి నక్షత్రమాన ప్రకారంగా వచ్చే కార్తెలు కర్షక, కార్మిక పంచాంగం అనవచ్చు. భరణి మూడు నాలుగు పాదాలలో సూర్యుడున్నపుడు డొల్లు కర్తరి, కృత్తిక నాలుగు పాదాలు, రోహిణి రెండు పాదాలలో సూర్యుడు ఉన్నప్పుడు పెద్ద కర్తరి అంటాం. కర్తరి అంటే కత్తెర అని అర్ధం, దేనికి కత్తెర? ఎండలో పనికి కత్తెరన్నమాట. వేసవిలో మే నెలలో మొదటివారంలో మొదలు మే చివరి వారం దాకా కర్తరి ఉంటుంది. ఆ తరవాత చల్లబడుతుంది కనుక పనులు మొదలుపెట్టవచ్చని చెప్పి ఉంటారు. వేసవిలో కార్మికుల భద్రతకోసం ఎంత గొప్ప ఏర్పాటు చేసారో చూడండి. ఈ కార్తెలు ఒక రోజు ఇంచుమించులో ప్రతి సంవత్సరం ఒకలాగే వస్తాయి.

కర్తరీలో చెట్లు నరకటం, నారతీయటం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లటం, భూమిని త్రవ్వటం, తోటలు వేయటం, చెఱువులు, బావులు,  కొలనులు త్రవ్వటం, కొత్తబండి కొనటం, అధిరోహించటం, నూతన గృహ నిర్మాణం చేయటం, పాతగృహాలను బాగు చేయటం వంటి గృహనిర్మాణ పనులు చేయరాదు. కర్తరీలో ఉపనయనం, వివాహం, యజ్ఞం వంటి కార్యాలను చేయవచ్చును.