తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి.
ముత్యపుపందిరి వాహనంపై గోవిందుడి కటాక్షం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు మే 26, ఆదివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు స్వామివారి వాహన సేవ జరిగింది.
నిత్య అలంకార ప్రియుడైన శ్రీవారు పూటకొక అలంకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించే ముత్యపుపందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తారు. జ్యోతిషశాస్త్రం ముత్యాన్ని చంద్రునికి ప్రతీకగా చెబుతోంది. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువులలో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద నిలిచిన స్వామివారి దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుందనడంలో సందేహం లేదు.
కల్పవృక్ష వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారి వైభవం
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం, 27వ తేదీ ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాల కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు.
అనంతరం ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు.
సర్వభూపాల వాహనంపై బకాసుర వధ అలంకారంలో గోవిందుడి అభయం
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారు బకాసుర వధ అలంకారంలో సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
మోహినీ అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి,