అంగరంగ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

 

శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి 11 నుండి  19వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తున్నారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు బయట జరుగుతున్నాయి.  స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసారు. శ్రీ‌నివాస‌మంగాపురంలో తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా  భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచారు. 

బ్రహ్మోత్సవాల వివరాలిలా...

  • ఫిబ్రవరి 15న గరుడసేవ, 
  • ఫిబ్రవరి 16న స్వర్ణరథోత్సవం
  •  ఫిబ్రవరి 18న రథోత్సవం
  • ఫిబ్రవరి 19న చక్రస్నానం 

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

ధ్వజారోహణంతో ప్రారంభం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 11వ తేదీ శనివారం ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య మీన‌లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.

అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.

మురళీకృష్ణునిగా...

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల వరకు శ్రీనివాసుడు శ్రీ మురళి కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

రెండో రోజు ఉదయం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం.

స్నపన తిరుమంజనం

అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్స‌వ‌ర్ల‌కు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంల‌తో అభిషేకం చేపట్టారు. 

హంస వాహనంపై స‌ర‌స్వ‌తీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు స‌ర‌స్వ‌తి దేవి అలంకారంలో హంస‌ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హంస వాహనం – బ్రహ్మ పద ప్రాప్తి

హంస వాహనసేవలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్ర‌హ్మ‌ప‌ద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.