పంచారామ క్షేత్రాలు 2023 : సామర్లకోట శ్రీ కొమరారామ భీమేశ్వరస్వామి ఆలయం


శ్రీ కొమరారామ భీమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటి. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉన్న భీమవరంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడి ఆలయం 60 అడుగుల ఎత్తులో రెండు అంతస్థులుగా ఉంటుంది. ఇక్కడి శివలింగం అంతకంతకూ పెరిగిపోతూ ఉంటే ఆ శివలింగంపై మేకు కొట్టారని పూర్వ చరిత్ర. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చాళుక్యరాజైన భీముడు(భీమ మహారాజు) నిర్మించినట్టు ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్రాక్షారామ ఆలయాన్ని కూడా ఆయనే నిర్మించాడని చరిత్ర చెబుతోంది. అందుకే ఈ రెండు ఆలయాలు నిర్మాణాకృతితో పాటు శిల్ప కళాలలో కూడా ఒకేలా ఉంటాయి. ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

స్థలపురాణం

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుణ్ణి సంహరించగా ఆ రాక్షసుని కంఠంలోని ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడగా అవే పంచారామ క్షేత్రాలుగా పిలువబడుతున్నాయి. అమరావతిలోని అమరేశ్వరాలయం, ద్రాక్షారామంలోని శివక్షేత్రం, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీరారామం, సామర్లకోటలోని ఈ కుమారారామం. 

కుమారారామ ఆలయ విశేషాలు

కుమారారామం ఆలయంలోని శివలింగం సున్నపురాయిలా తెల్లగా 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి అమ్మవారి పేరు బాలాత్రిపుర సుందరి. 1340-1466 ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో కొంతభాగాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది. కోటగోడలాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల రెండవ ప్రాకారం ఉంది. ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం, వెనుక భాగాన పెద్ద రాతిస్థంభము ఉన్నాయి. ఈ ఆలయం గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది. 

గర్భాలయంలో భీమేశ్వరస్వామి, బాలాత్రిపుర సుందరి అమ్మవారు భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తారు. ఆలయం చుట్టూ రెండవ ప్రాకారపు గోడను ఆనుకుని పొడవైన మంటపాలు రెండు అంతస్థులుగా ఉన్నాయి. ఈ మండపాలకు నాలుగు మూలలా సరస్వతీదేవి, కుమారస్వామి మొదలైన దేవతామూర్తుల మందిరాలు ఉన్నాయి. ప్రధానాలయానికి పశ్చిమదిశలో నూరుస్తంభాల మండపం ఉంది. వీటిల్లో ఏ రెండు స్తంభాలూ ఒకే పోలికతో ఉండవు. ఆనాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఇది నిదర్శనం. ఊయల మండపంలోని రాతి ఊయలను ఊపితే అది ఊగుతుంది. ఈ చిత్రాన్ని మనం నేటికీ దర్శించవచ్చు. చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్యకిరణాలు ఉదయంపూట స్వామివారి మీద, సాయంత్రంపూట అమ్మవారి పాదాల మీద పడడం ఇచ్చట మరో విశేషం. ఇక్కడి భీమగుండంలో స్నానంచేస్తే సర్వపాపాలూ పోతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రికి గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు.