మహాయోగి లక్ష్మమ్మ అవ్వ కర్నూలు జిల్లా ఆదోని మండలం ముసాను పల్లె గ్రామంలో ఆ ప్రాంత ప్రజల ఆరాధ్యదైవంగా భాసిల్లుతోంది. బేగరి కులం లో జన్మించిన చిన్న లక్ష్మవ్వ కులభేదం లేకుండా అన్ని వర్గాల పూజలందుకుంటున్నది. చిన్నతనం నుంచి దైవాంశసంభూతురాలిగా ఉన్న లక్ష్మవ్వలోని గొప్పతనాన్ని రాయ చోటి రామయ్య అనే వైశ్యుడు గమనించి, ఆమెను ఇంటి దేవతగా పూజించాడు. బ్రతికున్నప్పుడు ఆమెకు సపర్యలు చేశాడు. లక్ష్మవ్వ ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. నిత్యం ఆత్మ ధ్యానం లో వుండేది. గ్రామంలో జరిగే మంచి, చెడు సంఘటనల సమయం లో వెంటనే స్పందించేది. అప్పుడు ఆమె నోటినుండి ఏది చెపితే అది నిజమయ్యేదని ప్రజలు చెపుతారు. ఆమె 118 సంవత్సరాలు జీవించింది. ప్రతి వైశాఖ మాసంలో ఆమె పేరుతో రథం వూరేగింపు జరుగుతుంది.
మహా యోగి శ్రీలక్ష్మమ్మవారి జీవిత చరిత్ర
శ్రీ మహాయోగి లక్ష్మమ్మవారు ఆదోనికి 7 కి.మీ దూరంలో గల మూసానిపల్లె గ్రామంలో ఒక నిరుపేద దళిత కుటుంబంలో మంగమ్మ, బండెప్ప అనే పుణ్య దంపతులకు జన్మించింది. బాల్యం నుంచే అవధూతగా సంచరిస్తూ ఉండేది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ, నగ్నంగా సంచరించే ఆమెను పిచ్చిదని అందరూ భావించే వారు. ఆమె నిజతత్త్వాన్ని తెలుసుకోలేని సామాన్య ప్రజలు పెళ్ళిచేస్తే పిచ్చి కుదురుతుందని భావించి మారెప్ప అనే యువకునికిచ్చి పెళ్ళి జరిపించారు. కానీ పెళ్ళి రోజు రాత్రే ఆమె యథాప్రకారంగా దిగంబరంగా తిరిగివచ్చి పుట్టింటికి చేరింది. ఆమెను పిచ్చిదానిని గా భావించి ఆమెను రాళ్ళతో కొట్టి హింసించడం వంటి పనులు చేసినవారంతా ఆమెనోటినుంచి వెలువడిన వాక్కులే శాపాలుగా తగిలి నశించి పోయారు. ఆమె వాక్శుద్ధి అట్టిది. ఆదోనిలో జరిగే సంతకు వస్తున్న వారితో కలిసి తన 15వ ఏట ఆమె ఆదోని చేరింది. దిగంబరంగా తిరుగుతూ, దొరికింది తింటూ ఒక చోట ఉన్న కసువు తొట్టి పక్క స్థిరంగా ఉండిపోయింది. అప్పటినుంచీ ఆమెకు తొట్టి లక్ష్మమ్మ, తిక్క లక్ష్మమ్మ అనే పేరు స్థిర పడింది.
లక్ష్మమ్మ చూపిన మహిమలు
లక్ష్మమ్మ తన వాక్ శుద్ధితో గౌరమ్మ అనే మహిళ భర్తకు కాన్సర్ వ్యాధి నయం చేసిందని చెబుతారు. ఆమె అవ్వకు ఒక్క అణా సమర్పించుకోగా అవ్వ ఆమెను అరవై ఎకరాల భూస్వామినిగా చేసిందని చెబుతారు. అప్పటి నుండి ఆమె మహిమలు ప్రచారంలోకి రాసాగాయి. మహాత్ములకు చిత్తశుద్ధితో సమర్పించుకొన్నది ఎంత స్వల్ప మొత్తమైనా అది అనేక రెట్లు ఫలాన్ని ఇస్తుందనడానికి ఇదే నిదర్శనంగా భావిస్తారు. అవ్వ ఇచ్చిన ఫలాలను ఆరగించిన అనేక మంది గొడ్రాళ్ళు సంతానవతులైనారు. ఆ తర్వాత అనేకానేక ప్రజల కష్టాలను తీర్చే మహిమాన్విత చర్యలు చేపట్టింది. ఊరికి రాబోయే ఉపద్రవాలను తన చర్యలద్వారా సూచిస్తూ త్రికాలవేత్త శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వగా ప్రజల మనసుల్లో చిరస్థానం సంపాదించుకుంది.
ఖండ యోగంతో అబ్బురపరిచిన లక్ష్మవ్వ
కుండపోతగా వర్షం కురిసిన తరువాత పొంగిపొర్లుతున్న కాలువలో పడిపోయిన ఆమె మరణించి ఉంటుందని గ్రామస్థులు భావించి, చింతిస్తున్న సమయంలో, లక్ష్మమ్మవ్వ చెక్కుచెదరకుండా క్షేమంగా బయటికి వచ్చి తన మహిమతో అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. శరీరాన్ని ముక్కలుగా చేసి మరలా ఏమీ తెలియనట్లు సాధారణంగా దర్శనమిచ్చే ఖండయోగాన్ని కూడా ఆమె చూపారని ప్రజలు చెబుతున్నారు.
ఆమె నిజమహిమ తెలుసుకొన్నస్వర్గీయులు రాయచోటి వీరన్న, తుంబళంగుత్తి లక్ష్మయ్య , బల్లేకల్లు నరసప్ప, మన్నే రాంసింగ్ తదితరులు ఆమె సేవలో తరించి సౌభాగ్యము, సంపదలు పొందారని చరిత్ర చెబుతోంది. స్వర్గీయ రాచోటి రామయ్య గారు ఆమె సజీవురాలుగా ఉండగానే ఆమెకు రథోత్సవం జరిపించి ధన్యులైనారు. లెక్కకు మిక్కిలిగా మహిమలను ప్రదర్శించిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 16-05-1933 శ్రీముఖ నామ సంవత్సర వైశాఖ బహుళ సప్తమి నాడు సమాధిలో ప్రవేశించారు. అప్పటినుంచీ అవ్వ సమాధి చెందిన రోజున ప్రతి సంవత్సరం రథోత్సవం వైభవంగా జరుపబడుతుతోంది.
శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ సమాధి చెందిన ఆదోని పట్టణంలోనే కాకుండా ఆమె జన్మస్థలమైన మూసానిపల్లె మరియు అనేక ప్రాంతాలలో ఆమె మందిరాలు నిర్మించబడి నిత్యపూజలు జరుపబడుతున్నాయి కొలిచిన వారికి కొంగుబంగారంగా, నమ్మినవారికి నమ్మినంత వరాలనిచ్చే అమృతస్వరూపిణిగా భగవాన్ శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ప్రజల పూజలందుకుంటోంది. v