శ్రీకాకుళం జిల్లా టెక్కలికి ఆరు కిలోమీటర్ల దూరంలోని సుమంచ పర్వతం (పంచపాండవుల మెట్ట)పై బుధవారం భీష్మఏకాదశి రోజున వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉద యం 5 గంటల నుంచి అఖండ జ్యోతి, ప్రణవ పతాకావిష్కరణ, నిత్యాగ్ని హోత్రం, కుంకుమ పూజలు, శ్రీమద్భగద్గీత సామూహిక పారాయణం, స్వామీజీల ప్రవచనాలు, నామ సంకీర్తనలు చేపట్టనున్నారు.
చారిత్రక ప్రాధాన్యత
ఈ గుట్టకు త్రేతా యుగంలో వనవాస కాలంలో సీతా సమేతంగా శ్రీ రామ చంద్రుడు, సుసేనుడు, ద్వాపర యుగములో పంచ పాండవులు, ఋషులు, అవధూతలు, దిగంబరులు, యోగులు ఈ సుమంచ పర్వతాన్ని సందర్శిం చినట్లు చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఈ గుట్టలో ద్వాపర యుగంలో పాండవులు నివశించినప్పుడు భీమసేన, ద్రౌపది గుహలతో పాటు మిగిలిన పాండవులు నివసించిన గదుల ఆనవాళ్లు ఇక్కడ ఉన్నట్లు కను గొన్నారు.
నేపాల్ దేశ రాజవంశీకులు బాలకృష్ణానంద గిరిబాబా ఏడు దశాబ్దాల కిందట భారతదేశ పర్యటనలో భాగంగా ఈ ప్రాంత విశిష్టతను తెలుసు కొని వచ్చి యోగ కుటీరం స్థాపించి జ్ఞాన, తపో, నామ, భూత యజ్ఞాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. భీష్మఏకాదశి రోజున 1983 ఏప్రిల్ 24న ఆయన ఇక్కడే మహాసమాధి పొందినట్లు పెద్దలు చెబుతున్నారు. ఆ తరువాత బాబా దత్తపుత్రుడు స్వామి నిరంజనానంద గిరి ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేపడుతున్నారు.