నైమిశారణ్యం విశిష్ఠత ఏమిటి?


నైమిశారణ్యం ఎందరో గొప్ప ఋషులు, మునులు తపస్సు చేసిన పుణ్యభూమి. ఈ నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో గోమతీ నదీ తీరంలో ఉంది. ప్రాచీన చరిత్ర, భూగోళ వివరాల ప్రకారం నైమిశారణ్యం పాంచాల రాజ్యానికి, కోసల రాజ్యానికి మధ్య ఉన్న ప్రదేశం. ఉగ్రశ్రావశౌతి ముని మహాభారత కథను వేల శ్లోకాలతో రచించి ఏకబిగిన గానం చేసిన ప్రదేశం. అలాగే శ్రీరామచంద్రుడు అశ్వమేధయాగం చేసిన సమయంలో లవకుశులు అక్కడకు వచ్చి వాల్మీకి రామాయణం గానం చేసిన ప్రదేశమని కూడా ప్రసిద్ధి. కలి ప్రవేశించని ప్రదేశం కనుక ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన ప్రదేశం అని పురాణాల్లో పేర్కొనబడింది.

నైమిశారణ్యం యొక్క మహత్వము, గొప్పతనము అనేక పురాణాల్లోను, ధర్మశాస్త్రాలలోను లభిస్తుంది. పుణ్య తీర్థాలన్నింటిలోను నైమిశారణ్యం పవిత్రస్థలంగా భావించబడింది. తీర్థ ప్రదేశాలన్నింటిలోను ఉత్తమ తీర్థమని, పుణ్యక్షేత్రాలన్నింటిలోను ఉత్తమ పుణ్యక్షేత్రమని మునులు, ఋషులు ఇక్కడ నివసిస్తారని పరిగణించబడింది. 

నైమిశారణ్య దర్శనం సర్వ పాపనాశనం 

నైమిశారణ్యం ముల్లోకాల్లోను ప్రఖ్యాతిగాంచిన ఉత్తమ పుణ్యతీర్థం. శివునికి అత్యంత ప్రియమైన ప్రదేశం. మానవులు చేసే మహాపాపాలన్నీ నాశనం చేసే ప్రదేశం. ఇక్కడ దానం, తపస్సు శ్రాద్ధకర్మలు, యజ్ఞాలు ఏమైనా సరే ఒకసారి చేసినా ఏయేడు జన్మల పాపాలన్నీ పోతాయని అనేక పురాణాల్లో వివరించబడింది.

తీర్థస్థలాలు అన్నింటిలోనూ నైమిశారణ్యం అనే తీర్థం అన్ని పుణ్యతీర్థాలు దర్శించిన ఫలాన్ని అందిస్తుందని, అక్కడ అన్ని తీర్థాలు ఉంటాయని పురాణాల్లో తెలుపబడింది.

ఈ నైమిశారణ్యం శివక్షేత్రమని, యక్ష గంధర్వులచేత పూజింపబడేదని, అలాగే సకల సిద్ధులు అందించే ఉత్తమ క్షేత్రమని కూర్మపురాణంలో తెలియచేసారు. 

కలి ప్రవేశించలేని ప్రదేశం

దేవీ భాగవతంలోను, స్కందపురాణంలోను, బృహధర్మోపపురాణాల ప్రకారం నైమిశారణ్యం కలియుగ ప్రవేశానికి సంభవం కాదని తెలుపబడింది. కలియుగ ప్రవేశం జరుగలేదు కనుకనే నైమిశారణ్యంలో ఎప్పుడూ సత్యయుగమే నడుస్తూ ఉంటుంది. అందుకే మానవులకు ఇది ఉత్తమ ప్రదేశం. దేవుళ్లు, దేవతలు అందరూ భూమండలం అంతలోను కలియుగంలో ఉండే అరాచకానికి, అధర్మానికి భయపడి నైమిశారణ్యంలోనే నివసించడం మొదలుపెట్టారు. 

నైమిశారణ్యం వైష్ణవుల క్షేత్రమని కూడా చెప్పబడింది. ఇక్కడ త్రికాలజ్ఞ మహాత్ములు నివసిస్తారు అని కూడా పురాణాల్లో చెప్పారు. శ్రేష్ఠమైన, పుణ్యక్షేత్రమైన నైమిశారణ్యంలో శౌనకాది బ్రహ్మవాదులు, ఋషులు, పూజలు, తపస్సులు చేసి ముక్తి పొందారు. 

జంబూద్వీపంలో భారతదేశం ఉత్తమమైన దేశం. అలాగే క్షేత్రాల్లోకెల్లా నైమిశారణ్యం శ్రేష్ఠమైనది. పవిత్రమైన తొమ్మిది అరణ్యాలలో నైమిశారణ్యం ఒకటి. ఇక్కడ ఎవరైతే ప్రాణాన్ని శరీరాన్ని వదిలిపెడతారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. 

గంగానది ఒడ్డుమీద ఒక యోజనం నడిస్తే యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది. కాశీలో యోజనంలో నాలుగోవంతు నడిచినా అదే ఫలం లభిస్తుంది. అలాగే కురుక్షేత్రంలో ఒక క్రోసు దూరం నడిచినా, నైమిశారణ్యంలో ఒక్కొక్క అడుగు నడిచినా యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుంది. 

బ్రహ్మ దేవగణాలతో పాటు నివసించే నైమిశారణ్యం దర్శిస్తే పుణ్యం, దాంతోపాటే సిద్ధ ప్రాప్తిస్తాయి. నైమిశారణ్యంలో జంతువులను వేటాడదామనే పాపబుద్ధితో ప్రవేశించిన మానవులు కూడా ఆ పాపాలన్నింటి నుంచి విముక్తి పొందుతారు. 

నైమిశారణ్యం అన్ని తీర్థాల్లోకి ప్రసిద్ధమైన తీర్థం. సిద్ధులన్నీ ప్రసాదించగలిగేది. దీనిని ఎనిమిదవ వైకుంఠం అని కూడా అంటారు. 

నైమిశారణ్యం-చరిత్ర

శ్రీ కూర్మపురాణం, శివపురాణం, దేవీభాగవతం, పద్మ పురాణం మొదలైన పురాణాల్లో నైమిశారణ్యం గురించి ఇలా వివరించారు. కలియుగం ప్రారంభమయ్యే ముందు ఋషులు, మునులు బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ప్రార్ధించేవారుట. అయ్యా మాకు కలియుగ ప్రభావంలేని ప్రదేశం ఏదైనా చూపండి, మేము అక్కడికి వెళ్ళి పూజలు, యజ్ఞాలు, తపస్సు చేసుకుంటాము. అవి చేసుకుని సిద్ధిపొందుతాము, యజ్ఞయాగాదులు చేసిన అత్యుత్తమ ఫలం ప్రాప్తించేలా చేయండి అని. ఋషుల అభ్యర్ధనను మన్నించి బ్రహ్మగారు మనసు ద్వారా ఒక చక్రాన్ని నిర్మించి (మనోచక్రం) విసిరి, ఇలా చెప్పారు. ‘‘ఈ చక్రం యొక్క ఇరుసు ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం పరమ పవిత్ర ప్రదేశమవుతుంది. అక్కడకు వెళ్ళండి’’ అని బ్రహ్మగారు మనోమయ చక్రం బ్రహ్మాండం నుంచి భూమిని చుడుతూ ఈ అరణ్యానికి వచ్చింది. ఈ చక్రం కాక ముందు ఈ అరణ్యం ధర్మారణ్యం అని, విష్ణువనం అని పిలువబడేది.  బ్రహ్మగారి మనోమయ చక్రం యొక్క ఇరుసు అక్కడ పడింది కనుక ఈ అరణ్యానికి నేమి(ఇరుసు)+ శీర్ణ(నేమి) ఇక్కడ పడింది కనుక అరణ్య నైమిశారణ్యం అనే పేరు వచ్చింది. 

నైమిశారణ్యంలో ప్రసిద్ధమైన ప్రదేశాలు

చక్రతీర్థం

బ్రహ్మగారు పంపిన మనోమయ చక్రం ఎక్కడ భూమిమీద పడిందో అక్కడ పరమపావనమైన పుష్కరిణి నిర్మింపబడింది. దానినే చక్రతీర్థం అంటారు. చక్రతీర్థంలో స్నానం, ఆచమనం, దానం, ధర్మకార్యాలు మొదలైనవి చేసినట్లయితే వాటన్నింటికీ విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ విషయాలన్నీ అనేక పురాణాల్లో విపరింపబడ్డాయి. 

చక్రతీర్థంలో స్నానం చేసిన వారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. సోమవారం, అమావాస్య కలిసిననాడు చక్రతీర్థంలో స్నానం చేసిన మానవులకు మానోవాంఛలు తక్షణమే తీరి, సిద్ధి ప్రాప్తిస్తుందని నరసింహ పురాణంలో వివరించారు.  

చక్రతీర్థంలో స్నానమాచరిస్తే సమస్త పాపాలు నశిస్తాయని పద్మపురాణం తెలియచేస్తోంది. చక్రతీర్థం గొప్ప పుణ్యాన్నిచ్చే ప్రదేశం. సమస్త పాపాలను నశింపచేస్తుంది. భూమండలానికి మధ్యభాగము. భూమికి దేవత అని మహాభారతంలో చెప్పారు. చక్రతీర్థంలో స్నానం చేస్తే మనిషికున్న వ్యాధులన్నీ నశిస్తాయి. బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని కూడా మహాభారతం వివరిస్తోంది. 

లలితాదేవి

లలితాదేవి గురించి అనేక పురాణాలలో ఇలా చెప్పబడింది. దక్షప్రజాపతి కూతురు సతీదేవి తండ్రిచేత అవమానింపబడి దక్షయజ్ఞానికే తన దేహాన్ని ఆహుతి ఇచ్చేసింది. శివుని గణాలు అప్పుడు ఆ యజ్ఞాన్నే పాడుచేసాయి. ఇదంతా తెలుసుకుని శివుడు ఆ యజ్ఞ ప్రదేశానికి వచ్చి సతీదేవి శరీరాన్ని చూసి దుఃఖితుడై ఆ మృత కళేబరాన్ని చేత పట్టి, పచార్లు చేస్తూ తన పనులన్నింటిమీద విరక్తి చెందాడు. దాంతో సృష్టి సంహార క్రియ ఆగిపోయింది. సృష్టి అంతా అస్తవ్యస్తం అయిపోయింది. అప్పుడు జగత్కళ్యాణ కారకుడైన విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని 108 ముక్కలుగా చేసి భూమండలం అంతా విసిరాడు. ఎక్కడైతే ఆ భాగాలు పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా ప్రసిద్ధికెక్కాయి. 

ఈ నైమిశారణ్యంలో సతీదేవి యొక్క హృదయభాగం పడింది. అందుచేత ఈ శక్తిపీఠం లలితాదేవిగా పిలువబడుతోంది. పురాణాల్లో దీనిపేరు లింగాధారిణి అని, తంత్ర గ్రంథాల్లో ‘ఉడ్డీయనీ పీఠం’ అని చెప్పబడింది. 

స్వాయంభూ మను, మహారాణి శతరూపా తప స్థలం

మానవ సృష్టికి కారకులయిన స్వాయంభూమనువు, మహారాణి శత రూపాదేవి నైమిశారణ్యంలో 23 వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేకసార్లు వారి దగ్గరకు వచ్చారు. అయినా వారు సమాధి స్థితి నుంచి చలించలేదు. ఆఖరికి బ్రహ్మ భగవాన్ విశ్వరూపంలో్ వచ్చి ఇలా వరం ఇచ్చాడు. ‘‘నేను త్రేతాయుగంలో మీ పుత్రునిగా జన్మిస్తాను. అప్పుడు మీరు దశరథ మహారాజు, మహారాణి కౌశల్య అవుతారు. 

వ్యాసగద్దీ

వేదవ్యాసులవారు నైమిశారణ్యంలో వేదాలను సంకలనం చేసారు. 18 పురాణాలు, ఆరు శాస్త్రాలు కూడా ఇక్కడే రచించారు. తన ప్రముఖ శిష్యులు జైమిని, వైశంపాయన, పైలీ, అంగీరసులు ఒక్కొక్కవేదం లో జ్ఞానాన్ని ఒక్కొక్కరికి, తన పుత్రుడైన శుక మహామునికి భాగవతం లోని జ్ఞానాన్ని ఉపదేశించారు. 

సూత గద్దీ

ఈ ప్రదేశంలో్ సూత మహర్షి 88000 ఋషులకు శ్రీమద్భగవద్గీత పురాణం, ఇంకా అనేక పురాణాలు ఉపదేశించారు. మనం తరచుగా చేసుకునే సత్యనారాయణ వ్రతం కూడా సూత, శౌనకాది మహామునులు శిష్యులకు ఉపదేశించిన స్థలం ఇదే. 

శౌనక గద్దీ

శౌనక మహర్షి మొదలైన ఋషులందరూ లోకహితం, లోక కళ్యాణార్థం, స్వర్గప్రాప్తి కోసం వేల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి జ్ఞానసిద్ధి పొందారు. 

రామజానకి, సిద్ధేశ్వర మహాదేవ మందిరం

గోమతీనదీ తీరంలో శ్రీరామచంద్రుడు అశ్వమేధయాగం చేసారు. ఇక్కడ రామ, లక్ష్మణ, జానకి దేవి లకు శంకర భగవానునికి ప్రాచీన మందిరాలు ఉన్నాయి.  దీనిని దశాశ్వమేధ ఘాట్ అని కూడా అంటారు. ఈ విషయం పద్మపురాణంలోను, వాల్మీకి రామాయణం లోను ఉంది. 

హనుమాన్ గడీ, పాండవుల మెట్ట

రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో మాయావి అయిన అహిరావణుడు శ్రీరామచంద్రుని, లక్ష్మణుని దొంగిలించుకుపోయాడు. హనుమంతుడు అది గ్రహించి ఆ అహిరావణునితో యుద్ధంచేసి ఆ మాయావిని చంపి, రామలక్ష్మణులను విడిపించి, తన భుజస్కందాలపై కూర్చోపెట్టుకుని మొదటిసారిగా నైమిశారణ్యంలో కనిపించాడుట. అందుకనే ఇక్కడ పెద్ద హనుమంతుని విగ్రహం, ఆయన భుజస్కంధాలమీద కూర్చున్న రామలక్ష్మణులు మనకు దర్శనమిస్తారు.

ద్వాపరయుగంలో పాండవులు అదే కొండమీద కొంతకాలంం తపస్సుచేసారని కూడా అంటారు. ఈ కొండని పాండవుల మెట్ట అని కూడా అంటారు.

మిశ్రిత తర్థం, దధీచి తపస్థలం

పూర్వం వృత్తాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇంద్రునితో సహా దేవతలెవ్వరూ ఆ వృత్తాసురుని చంపలేకపోయారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ఆ రాక్షసుడి బారినుంచి తప్పించమని లేక ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. 

బ్రహ్మగారు వృత్తాసురుడు చాలా బలమైన రాక్షసుడని, అతన్ని చంపాలంటే వజ్రాయుధం కావాలని, గొప్ప తపస్వి అయిన దధీచి మహర్షి ఎముకలతో మాత్రమే అలాంటి ఆయుధం చేయగలరని, కాని అటువంటి మహర్షిని చంపటం మహాపాపం అని చెప్పారుట. అప్పుడు ఇంద్రుడు దధీచి మహర్షి దగ్గరకు వెళ్ళి లోక కళ్యాణార్ధం వజ్రాయుధం తయారు చేయాలని, ఆయన ఎముకలు దానం చేయమని యాచించాడుట. అన్నీ అర్ధం చేసుకున్న దధీచి మహర్షి ‘‘ఎముకలైతే తప్పక ఇస్తాను, కాని ప్రాణత్యాగం చేసే ముందు అన్ని తీర్థాల్లోను స్నానం చేయాలి, అందరి దేవుళ్ళను దర్శించాలి’’ అని కొన్నాళ్ళయ్యేక రమ్మన్నాడు. అప్పుడు దేవతలు ప్రార్థించగా విష్ణుమూర్తి అన్ని నదీమాలను, అందరి దేవతలను, దేముళ్ళను నైమిశారణ్యానికి పిలిపించాడుట. వాళ్ళందరూ 4 క్రోసుల ప్రదేశంలో, 252 కిలోమీటర్ల పరిధిలో వచ్చి కూర్చున్నారు. అప్పుడు దధీచి మహర్షి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు 15 రోజులు ప్రదక్షిణలు చేసి అన్ని నదీ జలాల్లోను స్నానం చేసి, అందరి దేవతలను దర్శించుకుని ప్రాణత్యాగం చేసితన అస్థికలను దానం చేసాడుట. అందుకే అక్కడ ఉన్న విగ్రహాల్లో, తపస్సుచేస్తున్న దధీచి మహర్షి, ఆయన పక్కన ఎముకలను అర్థిస్తున్న ఇంద్రుడు మనకు దర్శనమిస్తారు. అన్ని తీర్థాలనుంచి వచ్చిన నీళ్ళన్నీ కలిసిన పుష్కరిణి ఉన్న కారణంగా దాన్ని మిశ్రమతీర్థం అని అంటారు. 

దేవ దేవేశ్వర్

ఇక్కడ వాయు దేవుని చేత ప్రతిష్ఠించబడిన ప్రసిద్ధమైన పురాతన శంకరుని గుడి ఉంది. 

రుద్రావర్తకుండ్

రుద్రావర్త పుష్కరిణి గోమతీ నదీ జలాల నుండి ప్రవహించినదని ప్రతీతి. భస్మాసురుని భారి నుండి తప్పించుకోవాలని శివుడు గోమతీ నదీ జలాల్లో దాక్కుని ఈ పుష్కరిణి నుండి ఒక బిలం గుండా క్షీరసాగరంలోకి వెళ్ళాడని ప్రతీతి. ఈ పుష్కరిణి, బిలం నదీ జలానికి కొంచెం పక్కగా ఉంటాయి కనుక ఈ ప్రాంతానికి చెందినవారు దీనిని విశ్వసిస్తారు. భక్తిభావంతో ఎవరైనా బిల్వ పత్రాలనుగాని, పుష్పాలను గాని ఈ పుష్కరిణీ జలంలో్ వేస్తే మునిగినవి శివునికి పూజకని, తేలినవి మనకు ప్రసాదాలని నమ్ముతారు. భక్తిభావంతో వేస్తేనే బిల్వ పత్రం మునుగుతుందని, తేలిన ఆకులు గోమతీ నదీ ప్రవాహంలో చేరుతాయని నమ్మకం. 

హత్యాహరణ్ కుండ్

ఒకానొక కాలంలో శివుడు నైమిశారణ్యంలో వేల సంవత్సరాలుగా తపస్సు చేసుకకుంటున్నాడు. ఆ సమాధి స్థితిలో ఆయన కళ్ళు తెరుచుకున్నాయట. వెంటనే దాహం వేసిందిట. శివుని దృష్టి తూర్పువైపుగా సూర్యభగవానునిపై పడింది. వెంటనే సూర్యభగవానుడు శివునికి దాహం వేస్తోందని తెలుసుకుని వెంటనే ఒక పుష్కరిణిని సృష్టించాడట. ఆ జలంలో శివుడు తన దాహం తీర్చుకున్నాడని ప్రతీతి. సూర్యుడు సృష్టించిన పుష్కరిణి కనుక దీనికి సూర్యపుష్కరిణి అనేపేరు.

హత్యాహరణ్ అంటే చంపిన పాపం పోగొట్టేదని. రావణ వధానంతరం శ్రీరామచంద్రునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. అందుకే ఆయన అరిచేతిలో ఒక వెంట్రుక మొలిచింది. రామచంద్రుడు కులగురువైన వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి, ఇలా ఎందుకు జరిగింది. ఈ పాప నివారణకు మార్గం ఏమిటి అని అడిగాడుట. అప్పుడాయన నైమిశారణ్యంలో ఉన్న సూర్యకుండ్ లో స్నానం చేసి దర్భలతో ఆ నీళ్ళు చల్లుకుని పునీతులవ్వమని అప్పుడు బ్రహ్మహత్యాపాతకం పోతుందని చెప్పారు. 

శ్రీరామ చంద్రమూర్తి నైమిశారణ్యం వచ్చి ఈ సూర్యకుండ్లో స్నానంచేసి పునీతులై బ్రహ్మహత్యా పాపం నుండి విముక్తుడయ్యాడుట. అప్పటినుంచి ఈ పుష్కరిణివ ‘హత్యాహరణ్ కుండ్’ అని పిలువబడుతోంది. 

తదనందరం, ద్వాపరయుగంలో మహాభారత సంగ్రామం జరిగింది. అందులో పాండవులు గెలిచారు. కాని వారికి కులనాశన దోషం, బ్రహ్మహత్యాదోషం, గురు హథ్యాదోషం అన్నీ వచ్చాయి. ఈ దోషాలన్నింటిని నుంచి విముక్తి పొందడానికి, పాండవులు నైమిశారణ్యం వచ్చి ‘హత్యా హరణ్ కుండ్’ లో స్నానంచేసి పునీతులై, దానాలు, ధర్మాలు చేసి అన్ని పాపాల నుండి విముక్తు లయ్యారని ప్రతీతి.

ఇవే కాకుండా నైమిశారణ్యంలో ప్రతి ఇల్లు ఒక దేవాలయం. ఇంకా ఎన్నో పుణ్య ప్రదేశాలున్నాయి. ఇదొక పవిత్ర స్థలం. కలిదోషం లేని ఈ భూమిమీద నడిస్తేనే మానవులు పాపాల నుండి విముక్తులవుతారని ప్రసిద్ధి. 

పరిక్రమ

ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుక్ల పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 రోజులు, 84 క్రో్సుల దూరం , 252 కిలోమీటర్ల పరిక్రమ జరుగుతుంది. ఈ పరిక్రమలో అన్ని తీర్థాల జలాలు, అందరి దేవతల, దేవుళ్ళ దర్శనం లభిస్తాయి. ఈ పరిక్రమ చేసిన వారికి దధీచి మహర్షికి లభించినంత పుణ్యం లభిస్తుంది. పరిక్రమ చేసే సమయంలో ఎక్కడెక్కడ విశ్రాంతి తీసుకోవాలో దాన్ని ‘పడావ్’ అంటారు. దాని ప్రకారం పగలంతా ఎంతదూరం నడిచి, రాత్రి ఎక్కడెక్కడ విశ్వాంతి తీసుకోవాలని అనే క్రమం వివరింపబడింది. 

దీని ప్రకారం మొదటిరోజు రాత్రి కోరౌనా, రెండవరోజు రాత్రి హరయ్యా, మూడవరోజు రాత్రి నగవాకోథవా, నాల్గవరోజు రాత్రి గిరిధర పుర ఉమరారీ, ఐదవరోజు రాత్రి సాక్షీ గోపాలపురం, ఆరవరోజు రాత్రి దేవగావ్, ఏడవరోజు రాత్రి మడరువా, ఎనిమిదోరోజు రాత్రి జరిగావ్, తొమ్మిదో రోజు రాత్రి నైమిశారణ్యం, పదవరోజు రాత్రి కోల హమా బరేటీ, పదకొండవరోజు రాత్రి మిశ్రిత ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకోవాలి.

నైమిశారణ్యంలో సేవలు

పిండదానం

పితృదేవతలకు పిండప్రదానం చేసే మూడు పవిత్ర ప్రదేశాలు బ్రహ్మకపాలం శిరస్సుకి, నైమిశారణ్యం చక్రతీర్థం నడి భాగానికి, గయ విష్ణు పాదాలపై క్రిందిభాగానికి పిండ ప్రదానం చేయాలంటారు. నైమిశారణ్యం నాభి ప్రదేశం ‘‘పేట్ గయ’’ అంటారు. పితృదేవతల కడుపు నిండుతుందని అన్ని దోషాల నుండి విముక్తి పొందుతారని అంటారు. 

గోదానం

దధీచి మహర్షి కొమ్ములున్న ‘సుర’ అనే ఆవులకు, తన శరీరం నాకడానికి అప్పగించి, ఎముకలను ఇంద్రునికి దానం చేసాడు. సుర అనే ఆవు నాలుక ఎంత పదునంటే, దధీచి మహర్షి చర్మాన్ని, మాసం అంతా నాకబడిపోయి ఒక్క ఎముకలు మాత్రమే మిగిలాయి. అందుచేత ఇక్కడ ఒక ఆవుని దానం చేసినా, గోసేవ చేసినా మిగిలిన తీర్థాలలో చేసే గోదానం, గోసేవ కన్నా ఎన్నో రెట్లు అధిక ఫలం వస్తుంది.

భువన దానం

భక్తులకు విశ్రాంతి గృహాలు, ముని, ఋషి, సాధువులు ఉండటానికి పితృదేవతల పేరులో ధర్మశాలలు కట్టించినా, కట్టించడానికి సహాయం చేసినా విశేష ఫలాలు కలుగుతాయి. 

జలసేవ

యాత్రీకులకు, సాధువులకు చల్లటి త్రాగేనీరు అందేలా ఏర్పాటు చేస్తే, ఆ సేవకి విశేష ఫలం లభిస్తుంది. 

వృక్షదానం

నైమిశారణ్యంలో ఋషులు చెట్లరూపాలలో ఉంటారని ప్రసిద్ధి. వృక్షదానం వల్ల కూడా అధిక ఫలం లభిస్తుంది. 

నైమిశారణ్యంలో రైల్వేస్టేషన్ ఉంది. కాని అన్ని రైళ్ళు అక్కడ ఆగవు. ఢిల్లీనుండి, లక్నోనుండి వచ్చే రైళ్ళలో సీతాపూర్ స్టేషన్ లో దిగి ఆటోమీద నైమిశారణ్యం చేరుకోవచ్చు. అతి సులభమైన మార్గం లక్నోనుండి బస్సుమీద కానీ, ప్రైవేటు కారులో కాని 90 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక గంటన్నర నుండి రెండు గంటల్లో నైమిశారణ్యం చేరుకోవచ్చు.