అంతర్వేదిలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాల శుభ ఘడియలకు సుముహూర్తం ఆసన్నమైంది.
ఎంతో ప్రాచుర్యం పొందిన అంతర్వేది ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం ప్రతి ఏటా విద్యుత్ కాంతుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. స్వామి వారి కల్యాణోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. అంతర్వేది తీర్థం పేరుతో జరిగే తిరునాళ్లకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.
సాగరతీరంలో సాగర సంగమం జరిగే చోట ప్రశాంతమైన వాతావరణంలో కొపనాతి కృష్టమ్మ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు శ్రీ రాజా కలిదిండి లక్ష్మీ నరసింహ బహుద్దూర్ వారిని ధర్మకర్తగా నియమించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రతి ఏటా జరిగే కళ్యాణ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఉత్సవాల వివరాలిలా...
ఈ ఏడాది కూడా స్వామి వారి కల్యాణోత్సవాలకు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. రథసప్తమి నుండి 3 రోజుల పాటు స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. నేటి రాత్రి... 12.46 నిమిషాలకు... తెల్లవారితే బుధవారం... స్వామి వారి తిరు కల్యాణం జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన రథోత్సవం, 5వ తేదీ ఆదివారం చక్రస్నానం, 6వ తేదీ సోమవారం తెప్పోత్సవంతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.
లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసారు. భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన కేంద్రాలను నిర్మించారు. అలాగే ఈ ఏడాది దాదాపు 3 లక్షల వరకు లడ్డూలు సిద్ధంచేసారు.