శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.

కాగా, తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌‌స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌‌స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.