సకల జీవరాశుల క్షేమం కోసమే శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం

కరోనా మహమ్మారి పలు దేశాల్లో తిరిగి వ్యాపిస్తున్నట్టు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ప్రపంచ మానవాళితోపాటు సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం టిటిడి వేదపండితులు నిర్వహించారు. తిరుమ‌ల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం ఆదివారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసింది.  

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ లోకకల్యాణం కోసం చేసే ఇలాంటి యాగాల వల్ల అద్భుతమైన ఫలితాలు అందుతాయని చెప్పారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు అందాలని వారు ఆకాంక్షించారు.

ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్నిప్రణయనం, కుంభారాధన, ఉక్తహోమాలు, కలశాభిషేకం నిర్వహించారు. ఆ తరువాత రుత్వికులను సన్మానించి తీర్థప్రసాద వినియోగం చేశారు.

ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వ‌ర్యంలో 18వ తేదీ వరకు 21 మంది రుత్వికులు 7 హోమ గుండాలలో యాగం నిర్వ‌హించారు.