పూర్వవైభవంతో వెలుగొందుతున్న వకుళమాత ఆలయం

 కలియుగ ప్రత్యక్షదైవంగా కొలిచే శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. వందలఏళ్లపాటు ఆధ్యాత్మిక వెలుగులు నింపి.. తిరుమలకు వెళ్లే ఎందరో భక్తులకు ఆశ్రయమిచ్చి.. ఆకలితీర్చిన ఆ దివ్యధామం ప్రస్తుతం.. మహాసంప్రోక్షణ పనులు జరుపుకుంటోంది. టిటిడి ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. వకుళమాత ఆలయంలో గంటకొడితేనే తిరుమలలో ఉన్న కన్నబిడ్డకు నైవేద్యం పెట్టేవారట. తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో పేరూరు బండపై ఉందీ 320 ఏళ్ల నాటి పురాతన ఆలయం. అప్పట్లో మైసూరు పాలకుడిగా ఉన్న హైదర్ అలీ దండయాత్రల్లో ఆలయం దెబ్బతినడంతో పాటు.. విగ్రహం కూడా మాయమైంది. గుడిచుట్టూ ఉన్న కొండను మైనింగ్ మాఫియా కరిగించేసింది. వందల ఏళ్లుగా ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోక.. భక్తులు వెళ్లే దారి కూడా లేని దుస్థితిలో ఉందీ ఆలయం.

బంగారు తాపడం

ఈ ఆలయానికి బంగారు తాపడం చేయించడం విశేషం. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం తర్వాత.. బంగారు తాపడం చేయించిన ఆలయంగా వకుళమాత ఆలయం ప్రసిద్ధిగాంచనుంది.

కళ్యాణమండపాలు 

ఆలయం వద్ద కళ్యాణాలు చేసుకునేందుకు వీలుగా మండపాలు నిర్మిస్తున్నారు. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వైదిక సంస్కారాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమళ పుష్కరిణికి పునరుజ్జీవం నింపారు. ఆలయానికి ఈశాన్యంలో నూతన పుష్కరిణిని నిర్మించారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయరహదారి నుంచి ఆలయం వరకు సెంట్రల్‌ లైటింగ్‌తో అందమైన సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. కొండను చేరుకునేందుకు ఘాట్‌రోడ్డును నిర్మించారు.

తిరుమల తరహాలో నిర్మాణం

వకుళమాత ఆలయ నిర్మాణ శైలి పూర్తిగా తిరుమల తరహాలోనే ఉండటం విశేషం. ఆలయ శిల్పకళా వైభవం, నిర్మాణ కౌశలం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. గతంలో ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని చెబుతారు. హైదర్ అలీ దండయాత్రలో చాలా ఆలయాలు నాశనమయ్యాయి కానీ.. వకుళమాత ఆలయం మాత్రం పాడవ్వలేదు. కాకపోతే విగ్రహం ధ్వంసం కావటం.. ఆ తర్వాత ఆలయంలో దీప, ధూప నైవేద్యాలు లేకపోవడం, ఆ ఆలయం వకుళమాతది కాదని మైనింగ్ మాఫియా వాదించి మరీ కొండను తవ్వేసింది. 

చోళుల శిలాశాసనం 

ఆ తర్వాత పేరూరు కొండపైన క్రీ.శ.1198 నాటికే ఆలయం ఉండేదనే చారిత్రకాధారం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పనులు చేస్తుండగా.. 2019లో ఆలయం ఎదుట మట్టిని తొలగిస్తున్నపుడు తమిళ అక్షరాలతో ఓ శిలాశాసనం కనిపించింది.  ఆ శాసనాన్ని క్రీ.శ.1198లో చోళరాజులు వేసిన తమిళ శాసనంగా పురావాస్తు శాస్త్రజ్ఞులు నిర్థారించారు. చోళరాజ్యంలో సామంతుగా రెండవ వీరభల్లాలుడు క్రీ.శ.1173 నుంచి క్రీ.శ. 1220 వరకు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తిరుపతికి సమీపంలోని యోగిమల్లవరం పురాతన శివాలయంలో లభించిన శాసనాల ద్వారా ఆధారాలు ఉన్నాయి. అప్పటికే ఈ ఆలయం నిర్మితమై ఉందని ఈ శాసన సారాంశం. ఈ శాసనంతో వకుళమాత ఆలయంపై వచ్చిన వివాదాలన్నింటికీ తెరపడింది.