తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి స్వామివారు గరుడవాహనంపై భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6.15 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ వైభవంగా జరిగింది.
అనంతరం ఆలయం బయట గల వాహనమండపంలో శ్రీసుందరరాజస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. రాత్రి 7 గంటల నుండి స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.