గోరింటాకు-ఆషాడంలో ఎందుకు పెట్టుకోవాలి?

ఆషాడం అనగానే ఆడపిల్లలందరికీ గోరింటాకు గుర్తుకొస్తుంది. ఈ మాసంలో ఒక్కసారయినా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతున్నారు. 

గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?

ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! 

గోరింట ఎర్రగా పండాలంటే...!

* గోరింటాకుని రుబ్బేటప్పుడు కొంచెం చక్కెర, రెండు లవంగాలు వేయాలి. రుబ్బిన తర్వాత ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలిపి పక్కన పెట్టాలి. ఓ అరగంట అయ్యాక గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.

* అలాగే పెట్టుకున్న గోరింటాకు ఆరిపోయిన తర్వాత చక్కెర నిమ్మరసం కలిపిన మిశ్రమంలో ముంచిన దూదితో చేతిపైన అద్దాలి. అదేవిధంగా పెనంపై కొద్దిగా ఇంగువ వేడి చేసి, ఆ పొగను చేతులకు తగలనిచ్చినా గోరింటాకు ఎర్రగా పండుతుంది.

* ఇక గోరింటాకు తీసేశాక లవంగ నూనెను చేతికి రాసుకోవడం వల్ల కూడా చక్కగా పండుతుంది.