అచంచలమైన భక్తి విశ్వాసాలతో భగవదారాధన చేసి, దైవానుగ్రహాన్ని పొందేందుకు మన పూర్వులు నియమించిన కొన్ని పర్వ దినాలలో ఏకాదశి ఒకటి. తొలి ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి ,పుత్రదా ఏకాదశి అంటూ పలు ఏకాదశులను మనం జరుపుకుంటాం. ఏకాదశి ఒక పుణ్య తిథిగా కూడా మనకు తెలుసు. ఇలాంటి ఏకాదశుల్లో జ్యేష్ఠ బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి కూడా చాలా ప్రాముఖ్యమైనది. జూన్ 24వ తేదీన సర్వఏకాదశి పర్వదినం.
వ్యవసాయ పనులకు శ్రీకారం
సర్వ ఏకాదశిని కర్షకులు అత్యంత శుభదినంగా భావిస్తారు. ఈ రోజు శ్రీమహావిష్ణువును ప్రార్థించి రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. తర్వాత పొలానికి వెళ్ళి పని ప్రారంభిస్తారు. ఈవేళ తప్పనిసరిగా ఏదో ఒక వ్యవసాయ పని చేయాలనే నమ్మకం రైతుల్లో ఉంది. ఈ రోజు రైతులు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. సర్వ ఏకాదశినాడు ఈ పేలపు పిండిని తప్పకుండా తినాలని రైతులు విశ్వసిస్తారు.
సర్వ ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కనీసం విన్నా కూడా ఈతిబాధలు సులభంగా తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు.v