ఆరుద్ర కార్తెతో వ్యవసాయ పనులు ఆరంభం

పంచాగం ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలో ఆరుద్ర కార్తె ప్రవేశిస్తుంది. ఆరుద్ర కార్తె అంటే రైతులు వ్యవసాయ పనులకు సంసిద్దం కావాలనే సంకేతం అన్నమాట. పండితులు ఈ కాలంలోని  తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఆరుద్ర కార్తె అనగానే ఎర్రటి మెత్తని అందమైన ఆరుద్ర పురుగులు మనకు జ్ఞాపకం వస్తాయి. మక్మల్ గుడ్డ కప్పుకున్నట్టుగా ఉండే పురుగులను పట్టుకుంటే వెంటనే ముడుచుకుపోతాయి. ఈ పురుగులు కనిపించడం రైతులకు వ్యవసాయ పనుల ప్రారంభానికి సంకేతంగా భావిస్తారు. అయితే ఈ పురుగులు ప్రస్తుతం కనుమరుగయ్యాయనుకోండి.  ఆరుద్రకార్తె ఈ నెల 22వ తేదీ నుంచి ఆరుద్రకార్తె ప్రారంభమవుతోంది.

కార్తెలు...విశిష్టత

వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా, వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి. మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు. తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు. తెలుగురైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు. తరువాతి తరాలకూ ఆ జ్ఞానం అందేలా చేశారు. పురుగుమందులు, జన్యుమార్పిడి విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలతో భయంగొలుపుతున్న కొత్త సమాజంలో రాబోయే రోజుల్లో ఇంకా కొత్త సామెతలు పుట్టవచ్చు. జోతిష్కులు 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయమప్పుడు ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచారు. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు.సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు ప్రజానీకం చంద్ర మానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌర మానాన్ని పాటిస్తున్నారు. తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాలలోనుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని ‘కార్తెలు’, వాటిపై సామెతల రూపంలో ప్రచారం చేశారు. ఆయా కార్తెలు.. నెలలు... రాశుల వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో అందరికీ అర్ధమయ్యేలా సామెతలలో చక్కగా చెప్పుకున్నారు. 

భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు, దానివలన జరిగే ప్రత్యేకాంశలను సవివరంగా వివరించింది. ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు, జానపదులు ( గ్రామీణ ప్రాంత ప్రజలు) ఎక్కువగా వీటిపై ఆధారపడి చేయువృత్తులు, వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం, సాగు చేసుకుంటారు. 

ఆరుద్ర కార్తె సామెతలు 

  • ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు
  • ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
  • ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.
  • ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
  • ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.
  • ఆరుద్రతో అదనుసరి.
  • ఆరుద్రలో అడ్డెడు చల్లితే ‘పుట్టెడు’పండుతాయి.
  • ఆరుద్ర వాన ఆదాయాల బాన.
  • ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
  • ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
  • ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
  • ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.